Vizag records the Highest Record Breaking Temperature of this century: నేడు విశాఖపట్నం ఒక అరుదైన రికార్డుని నమోదు చేసింది. వైజాగ్ లో ఈ శతాబ్ధంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. నగరంలోని ముఖ్యంగా ఏర్పోర్టులో 44.6 డిగ్రీల అత్యథిక ఉష్ణోగ్రత నేడు మధ్యాహ్నం నమోదయ్యింది. విజయవాడ అయినా 43 డిగ్రీలు ఉంది, కానీ సముద్ర తీర ప్రాంతం పక్కనే ఉంటూ అంత ఉష్ణోగ్రత అంటే అది దాదాపుగా 55 డిగ్రీలు లాగా ఉంటుంది. రుతుపవనాలు ఆలస్యం అయితే జరిగేది ఇది. దీనికి తోడు పసిఫిక్ లో ఎల్-నినో ప్రభావం వలన వేడి అత్యధికంగా ఉంది అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
గత పదేళ్లలో గమనిస్తే విశాఖపట్నంలో ఉష్ణోగ్రత సరాసరి 7 డిగ్రీల మేర పెరిగింది. 2011లో గరిష్టంగా 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 2012లో 37.4 డిగ్రీలు, 2013లో గరిష్టంగా 37 డిగ్రీలు, 2014లో తొలిసారి విశాఖపట్నంలో 40 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు అయింది. 2015లో 36.8 డిగ్రీలకే పరిమితమైంది. ఆపై 2016లో 36.2 డిగ్రీలు, 2017లో 35.6 డిగ్రీలు, 2018లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత, 2019లో 38 డిగ్రీలు, 2020లో 35.2 డిగ్రీలు, 2021లో 35.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తాజాగా గడిచిన 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతను విశాఖ చూసింది.
విశాఖలో 44.6 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తరువాత కాకినాడలో 43.2 డిగ్రీలు, విజయవాడలో 43 డిగ్రీలు, తిరుపతిలో 42.2 డిగ్రీలు, నెల్లూరులో 41.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీ తీర ప్రాంత ప్రజలు ఎండల కంటే ఉక్కపోత, వడగాలులకు సతమతం అయ్యారు. గత మూడు రోజులుగా గమనిస్తే విశాఖలో సరాసరిగా 42 డిగ్రీల ఎండ దంచికొట్టింది. సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చితే 11 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో విశాఖ ప్రజలు వేడి, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వడదెబ్బ కొట్టే అవకాశం ఉందని ప్రజలు నీటిని అధికంగా తాగాలని, వీలైతే పళ్ల రసాలు లాంటివి తీసుకుంటే వడదెబ్బ ప్రభావం తక్కువగా ఉంటుందని సాగర నగర ప్రజలకు వైద్యులు, అధికారులు సూచించారు.
ఓవైపు కోస్తాంధ్రలో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతుంటే, రాయలసీమను మేఘాలు కమ్మేశాయి. తిరుపతి, అన్నమయ్య జిల్లాలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోనూ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.