Visakhapatnam News: వైద్యులు నిర్లక్ష్యం వల్లే యువకుడి మృతి చెందాడని గుర్తించిన రాష్ట్ర వినియోగదారుల కమిషన్.. బాధిత కుటుంబానికి 40 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారని తీర్పునిచ్చింది. విశాఖలోని క్వీన్స్ ఎన్నారై ఆసుపత్రి యాజమాన్యం.. ముగ్గురు వైద్యులు కలిసి 40 లక్షలు చెల్లించాలని సూచించింది. 


అసలేం జరిగిందంటే..? 
విశాఖకు చెందిన శీలా తులసీరామ్ (26) కు విపరీతమైన కడుపు నొప్పి లేవడంతో... 2013 అక్టోబర్ 8వ తేదీన క్వీన్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు. అయితే 24 గంటలు నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడని.. శస్త్ర చికిత్స చేయాలంటూ అదే రోజు రాత్రి 9 గంటలకు శస్త్ర చికిత్స చేశారు. తర్వాత యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఐసీయూలో ఉంచిన తులసీరాం పరిస్థితిని కుటుంబ సభ్యులకు తెలియనీయలేదు. కేసు రికార్డుకు చూపించేందుకు కూడా సిబ్బంది ఒప్పుకోలేదు. ఒకరోజు గడిచిన తర్వాత వచ్చి తులసీరాం కోమాలోకి వెళ్లాడని వైద్యులు తెలిపారు. అదే నెల 12వ తేదీన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తులసీ రాంకు ఇతర అనారోగ్య సమస్యలు లేవని, ఎలా చనిపోతాడని బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. 


భారీగా పరిహారం చెల్లించాలని బాధితుల డిమాండ్ .. 
ఇదే విషయంపై మృతుడి కుటుంబ సభ్యులు వినియోగదారుల కమిషన్ ను 2015లో ఆశ్రయించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తులసీ రాం ప్రాణాలు కోల్పోయాడని, ఆసుపత్రి యాజమాన్యం, చికిత్స అందించిన వైద్యుల నుంచి రూ.99,99,000 పరిహారం కింద ఇప్పించాలని కోరారు. ఘటనకు బాధ్యులుగా క్వీన్స్ ఎన్నారై ఆసుపత్రి, జనరల్ సర్జన్ డాక్టర్ టీఎస్ ప్రసాద్, మత్తుమందు వైద్యులు డాక్టర్ తనూజ రాజ్యలక్ష్మీ దేవి, డాక్టర్ రవిచంద్రహాస్ లను పేర్కొన్నారు. కమిషన్ జారీ చేసిన తీర్పుల్లో రికార్డుల్లో చికిత్స వివరాలు నమోదు చేయలేదన్న విషయాన్ని వైద్యురాలు తనూజ అంగీకరించారని పేర్కొంది. వైద్య సేవల్లో లోపం కారణంగా తులసీరాం మరణించినట్లు స్పష్టం చేసింది. 


రూ.40 లక్షలు చెల్లించాలని ఆదేశాలు.. 
ఈ కేసుపై విచారణ జరిపిన ఏపీ వైద్య మండలి కూడా మెడికల్ రిజిస్టర్ నుంచి డాక్టర్ తనూస పేరును 6 నెలల పాటు తొలగించింది. మృతుడి తల్లిదండ్రుల ఆభ్యర్థన మేరకు మాన హక్కుల కమిషన్ ద్వారా కేజీహెచ్ వైద్యుల బృందం ఈ ఘటనపై విచారణ జరిపి, వైద్య సేవల్లో యాజమాన్యం లోపం, మత్తుమందు వైద్యుల నిర్లక్ష్యం ఉందని పేర్కొంది. వీటిని కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుంది. పరిహారం బాధిత కుటుంబానికి రూ.40 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.  


వైద్యురాలి నిర్లక్ష్యం-గర్భ సంచి కోల్పోయిన పోలీసు అధికారి భార్య! 
గర్భణీగా ఉన్న మహిళ ఆసుపత్రికి తీసుకెళ్తే గర్భసంచిలో సమస్య ఉందని చెప్పి పరిష్కరిస్తామని నిర్లక్ష్యంతో గర్భవిచ్చితికి కారకురాలయ్యారు. మొదటి కాన్పులో ఆపరేషన్ ద్వారా బిడ్డను కన్న ఆ తల్లి ఇప్పటికే ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆపరేషన్ చేసిన వైద్యురాలి నిర్లక్ష్యంతో అంతర్గత భాగాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. చివరకు గర్భసంచి తొలగించి  చేతులు దులుపుకొంది.


డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలి భర్త ఓ పోలీసు అధికారి. ఆయనే ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం జిల్లా ఓ ఎస్సై భార్య గర్భవతి. కడపులో నలతగా ఉందని వారం రోజుల క్రితం అమలాపురంలోని ఆదర్శ ఆసుపత్రిలో చూపించారు. గర్భిణీ అయిన ఆమె పొట్టలో తలెత్తిన సమస్యను డీఎన్సీ ద్వారా పరిష్కరించవచ్చని వైద్యురాలు తెలిపారు. అది కాస్తా అబార్షన్ కు దారితీసింది. అదే టైంలో అంతర్భాగంలో మరిన్ని అవయవాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. దీంతో మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. వైద్యురాలి నిర్లక్షంతో ఆమెకు గర్భసంచిని పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికీ వైద్యులు నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆసుపత్రిపై, వైద్యురాలిపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఎస్సై.