విశాఖ‌ప‌ట్నంలోని మ‌ధుర‌వాడలో పది రోజుల క్రితం (మే 11) పెళ్లి పీటలపైనే వధువు కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే. అయితే, పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఆమె ఉన్నట్టుండి క్షణాల్లో ఎలా చనిపోయిందనే అంశం అప్పుడు ఎవరికీ అంతుబట్టలేదు. ఆమె మరణంపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా సృజ‌న ఆత్మహ‌త్య కేసులో చిక్కుముడి వీడింది. పెళ్లి ఆపాల‌నుకునే ప్రయ‌త్నంలో భాగంగానే సృజ‌న ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఆమె ఆత్మహ‌త్యకు ప్రేమ వ్యవ‌హార‌మే కార‌ణ‌మ‌ని పోలీసులు నిర్ధారించారు. ఆమె ఫోన్‌లో ఉన్న కాల్ రికార్డర్ సాయంతో నిజాలు బయటికి వచ్చాయని చెప్పారు. వధువు పెళ్లికి ముందు సృజ‌న తన ప్రియుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు.


ఏడేళ్ల నుంచి ప్రేమ
విశాఖపట్నంలోని ప‌ర‌వాడ‌కు చెందిన తోకాడ మోహ‌న్ అనే యువ‌కుడు, సృజ‌న ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అందులో భాగంగా పెళ్లి  చేసుకుందామని సృజ‌న మోహన్‌ను కోర‌గా, మంచి ఉద్యోగం, సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాన‌ని మోహన్ చెప్పాడు. ఇంకో రెండేళ్లు ఆగుదామని చెప్పాడు. పెళ్లికి ముందు కూడా ప్రియుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసిన యువతి.. ఎలాగైనా పెళ్లి ఆపేందుకు ప్రయత్నించాలని నిర్ణయించింది. పెళ్లికి ముందు రోజు విష ప‌దార్థం తీసుకుంది.


దీంతో కళ్ళు తిరిగిపడిపోగా నీరసం వల్ల అనుకుని ఆమె తల్లితండ్రులు సృజనను హాస్పిటల్ కు తీసుకెళ్లి సెలైన్ ఎక్కించినట్టు తెలిపారు. అయితే పెళ్లిరోజు కూడా సృజన మళ్లీ విషపదార్ధం తీసుకోవడంతో అది మోతాదు ఎక్కువ అయి పెళ్ళిపీటల మీదే అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. ఆమె చనిపోయింది అని తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యులు తొలుత గుండె ఆగిపోయింది అనుకున్నారు. అయితే ఆమె బ్యాగ్ లో గన్నేరు పప్పు దొరకడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించి ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించగా ఆత్మహత్యగా తేలింది. అయితే దానివెనుకున్న కారణాలను పోలీసులు ప్రస్తుతం రాబట్టగలిగారు.


కేవలం పెళ్లి తప్పించుకునే ప్రయత్నంలోనే సృజన మృతి చెందినట్లుగా పోలీసులు కనుగొన్నారు. ఆమె తన ప్రేమికుడు మోహన్ తో జరిపిన చాట్ వివరాలను రికవరీ చేసిన పోలీసులు ఇన్ స్టాగ్రామ్ ద్వారా చాట్ జరిగినట్టు గుర్తించారు. ఆ చాట్ హిస్టరీని సృజన డిలీట్ చెయ్యడంతో వాటిని రికవరీ చెయ్యడానికి పోలీసులకు కాస్త సమయం పట్టిందని వారు చెప్పారు.


కుప్పకూలిన వెంటనే ఆస్పత్రికి
కుప్పకూలిన వెంటనే వధువును ఓ ప్రైవేటు ఆస్పత్రికి తొలుత తరలించారు. పరిస్థితి మెరుగవుతుందని భావించి మళ్లీ 2 గంటలకు కూడా మరో ముహూర్తం ఖరారు చేశారు. వధువు కోసం పెళ్లి మండపం వద్ద బంధువులు వేచి ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వధువు పరిస్థితి విషమించడంతో ఇండస్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తర్వాతి రోజు ఉదయం మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు.


బ్యాగులో గన్నేరు పప్పులు
విచారణలో భాగంగా పోలీసులు ఆమెకు సంబంధించిన వస్తువులను తనిఖీ చేయగా, వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు దొరికాయి. ఆమె గన్నేరు పప్పు తిని ఉంటుందా? లేక మరేమన్నా విషం తీసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.