Visakha News: నవంబర్ 2వ తేదీ అంటే బుధవారం రోజున ఐఎన్ఎస్ డెగా విశాఖపట్నం విమానాశ్రయంలో యాంటీ హైజాక్ మాక్ ఎక్సర్ సైజ్ ని నిర్వహించింది. మెరైన్ కమాండోలు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో సహా వివిధ ఏజెన్సీలు సృష్టించిన మాక్ సిట‌్చుయేషన్‌తో  ఈ యాంటీ-హైజాక్ ఎక్సర్‌సైజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎయిర్‌ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. హైజాక్ బెదిరింపులను ఎదుర్కోవటానికి ఆకస్మిక ప్రణాళిక, విధానాల సామర్థ్యాన్ని పరీక్షించడం ఈ ఎక్సర్ సైజ్ ముఖ్య లక్ష్యం అని సంబంధిత అధికారులు వెల్లడించారు.


నావికాదళం, విమానాశ్రయ సిబ్బంది, ఇతర కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలకు చెందినవారు ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. ఈ డ్రిల్ కోసం నేవల్ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఉపయోగించారు. ఎక్సర్ సైజ్ పూర్తయిన తర్వాత హైజాక్ జరిగిన సమయంలో ఎలా నడుచుకోవాలనే అనే విషయాలపై అవగాహన కల్పించారు. భవిష్యత్ ఆకస్మిక పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPలు) నిర్వహించారు. విమానాశ్రయాల ప్రణాళిక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అలాగే హైజాక్ పరిస్థితిలో అన్ని ఏజెన్సీలకు వారి సంబంధిత బాధ్యతలను పరిచయం చేసే లక్ష్యంతో నేషనల్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ దేశంలోని విమానాశ్రయాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది. అందులో భాగంగానే విశాఖపట్నం విమానాశ్రయంలో ఐఎన్ఎస్ డెగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.