Ganja Cultivation: ప్రకృతి అందాలకు, ఆకుపచ్చని కాఫీ తోటల సౌందర్యానికి నిలయమైన ఏజెన్సీ ప్రాంతాలు గంజాయి కేంద్రాలుగా మారుతున్నాయి. మన్యం ప్రాంతాల్లో అడవి అందాల మాటున గంజాయి సాగు ఏటేటా విస్తరిస్తోంది. ఏజెన్సీలో ఒక్కప్పుడు గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వారు. కొండకొనల్లో దొరికే అటవీ ఉత్పత్తులను సేకరించి పొట్టపోషించుకునే వారు. అయితే స్మగ్లర్లు వారిని గంజాయి సాగువైపు మళ్లించారు. ఒక్క విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతోందని అంచనా.
దక్షిణ భారతంలో గంజాయి రవాణాకు విశాఖ మన్యం అనువైన ప్రాంతం కావడంతో స్మగ్లర్లు విశాఖ మన్యంను టార్గెట్ చేసుకున్నారు. తమిళనాడు, కేరళ నుంచి వచ్చి గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తున్నారు. ఏటా 5 వేల కోట్లుకుపైగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని అంచనా. అధికారులు ఎంత పకడ్బంది చర్యలు తీసుకున్న గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా జరుగుతోంది. అడ్డదారిలో అడ్డగోలుగా సంపాదించడానికి అలవాటు పడ్డవారు గంజాయిని అక్రమంగా తరలిస్తూ సోమ్ము చేసుకుంటున్నారు.
ఈ దందా అరికట్టటం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారిపోయింది. అంబులెన్స్, బొగ్గు లారీ, ఇటుకల లారీ ఇలా గంజాయి స్మగ్లర్లు రూటు మార్చి అర్ధం కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్నారు. వాటిని ఎప్పటిప్పుడు ఎక్సైజ్ పోలీసులు అడ్డుకుంటూ గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. మరి కొందరు ఆదాయం కోసం ఏకంగా ఇళ్లలోనే గంజాయి మొక్కలు పెంచుతున్నారు.
పర్మిషన్ ఇస్తే గంజాయి పండిస్తాం
అయితే విశాఖకు చెందిన జనజాగరణ సమితి డిమాండ్ గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. వైజాగ్ ప్రాంతంలో గంజాయి సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 15 వేల ఎకరాల్లో గంజాయి పంట సాగు చేస్తున్నారని. ఒక్కో ఎకరాకు ఏడాదికి రూ.4 లక్షల పెట్టుబడి పెడితే రూ.40 లక్షల ఆదాయం వస్తుందని తెలిపింది. ప్రపంచంలోనే రైతులకు అత్యధిక ఆదాయం ఇచ్చే పంట గంజాయి అని. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చి, రైతులను అప్పుల నుంచి బయటపడేయాలని కోరింది.
దొరికేది తక్కువ.. తరలించేది ఎక్కువ
గంజాయి మొక్క పెంచడమే నేరం. తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు ఆదాయ వనరుగా మారింది. తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేసి గంజాయి రవాణాను అడ్డుకుంటున్నారు. గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిస్తే అక్కడికి వెళ్లి వాటిని నాశనం చేస్తున్నారు. అయినా వారి కళ్లు గప్పి చాలా చోట్ల గంజాయి సాగు జరుగుతూనే ఉంటుంది. పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ కొంతవరకు అడ్డుకట్ట వేయగలుగుతున్నా.. దొరికే దాని కంటే సరిహద్దులు దాటి వెళ్లేదే ఎక్కువగా ఉంటోంది.
గంజాయి సాగవ్వకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. సాగు, విక్రయం, సరఫరా చేసే వారిపై పోలీస్, ఎక్సైజ్ అధికారులు నిఘా పెడుతున్నారు. గతంలో గంజాయి సాగు చేసిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. వారిని సన్మార్గంలో నడిపించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, తండాలు, పట్టణ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గంజాయి సాగుతో ప్రజలకు కలిగే ఇబ్బందులు, యువతపై ప్రభావం, రైతులకు కలిగే నష్టాలు, సంక్షేమ పథకాలపై ప్రభావం చూపే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.