Visakha News: 90 లక్షల రూపాయలకు 500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయల విలువ చేసే 2 వేల రూపాయల నోట్లు ఇస్తామంటూ ఇద్దరు నేవీ ఆఫీసర్లను మోసం చేసిందో ముఠా. అయితే ఈ ముఠాకు నాయకత్వం వహించింది పోలీసు అధికారులే అన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ అధికారి ఉన్నత స్థాయిలో పని చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. 


అసలేం జరిగిందంటే..?


ఆ అధికారి వద్ద కోటి రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు వరకూ ఉన్నాయి. ఇటీవలే రెండు వేల రూపాయలను తిరిగి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో వాటిని ఎలాగైన మార్చుకోవాలనుకున్నారు. నేరుగా బ్యాంకుకు వెళ్లలేదు. తెలిసిన వాళ్ల ద్వారా తన వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను ఎవరికైనా అంటగట్టాలనుకున్నారు.


ఈ క్రమంలోనే సదరు అధికారికి ఓ నేవీ రిటైర్డ్ అధికారులు తగిలారు. వారి వద్ద కోటి రూపాయల వరకు నగదు ఉందని గ్రహించిన ఆ అధికారి వారికి టోకరా వేశారని టాక్. 80 లక్షల రూపాయల 500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయలు ఇస్తానన్న మాట వాళ్లతో చెప్పారు. వాళ్లు కూడా ఓకే అన్నట్టు సమాచారం. 


రెండు గ్రూప్‌ల మధ్య డీల్ కుదిరిన తర్వాత నోట్ల మార్పిడీ జరిగింది. అయితే ఇక్కడే అధికారి తన తెలివితేటలు ఉపయోగించారు. దీంతో మొత్తం కుట్రంతా బయటకు వచ్చింది. ఇప్పుడు అది పోలీసు వర్గాల్లో చర్చకు కారణమైంది.


పోలీసు అధికారి మాటలు నమ్మిన రిటైర్డ్ నేవీ ఆఫీసర్లు కొల్లి శ్రీను, శ్రీధర్  90 లక్షల విలువ చేసే 500 రూపాయల నోట్లు పట్టుకొని వచ్చారు.  ఈక్రమంలోనే ఆ అధికారిణి సహా మరో నలుగురు 12 లక్షల రూపాయలను వీరి నుంచి అప్పనంగా లాగేశారు. అయితే విషయం గుర్తించిన నేవీ మాజీ అధికారులు ఆ అధికారిని ప్రశ్నించారు.  వారి మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా, తన సిబ్బందితో కొట్టించారని ఆరోపణ. విపరీతంగా బెదిరించి వారిని ఇంటికి పంపించేశారట. అయితే ఏం చేయాలో పాలుపోని కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులను ఆశ్రయించారు.


ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది. అధికారితోపాటు డ్రైవర్, ఇంకో హోంగార్డు, ఇద్దరు నేవీ మాజీ అధికారులపై కూడా కేసు రిజిస్టర్ చేసి విచారిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ కేసులో చిక్కిన అధికారిపై చాలా ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు.