Visakha Crime News: విశాఖలో భారీగా మత్తు ఇంజెక్షన్ల ముఠా గుట్టు రట్టు అయింది. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న డ్రగ్ మాఫియాను టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 850 మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. 


అసలేం జరిగిందంటే..?


ఇతర రాష్ట్రాలలో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి.. వాటిని కొరియర్ ద్వారా ఏపీకి తీసుకొస్తున్నారు. యువతను లక్ష్యంగా చేసుకొని ఈ మత్తు ఇంజెక్షన్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇలా లక్షల్లో సంపాదించుకుంటూ అక్రమంగా బతికేస్తున్నారు. కంచరపాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని బర్మా క్యాంపులో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న కళ్యాణ్ కుమార్ పెంటాజోసిన్ లాక్టేట్ ఇంజక్షన్లను.. ఉత్తర ప్రదేశ్ నుంచి కొరియర్ ద్వారా విశాఖపట్నం తీసుకొచ్చి యువతకు విక్రయిస్తున్నాడు. విచ్చలవిడిగా డ్రగ్స్ బయట దొరుకుతుండడంతో యువత వీటిని కొనుగోలు చేస్తూ బానిసలుగా మారుతున్నారు. నగరంలో చాలా మంది యువత డ్రగ్స్ కు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. 


మత్తులో అనేక అరాచకాలు..


యువత మాదకద్రవ్యాలను వినియోగిస్తూ ఆ మత్తులో అసాంఘిక శక్తులుగా మారి.. అనేక అరాచకాలు చేస్తున్నారు. అమ్మాయిలపై అత్యాచారలకు పాల్పడడం, పలువురిపై హత్యాయత్నానికి పాల్పడడం వంటివి చేస్తున్నారు. యువతనే టార్గెట్ చేస్తూ.. డ్రగ్స్ మాఫియా చేస్తున్న అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అయితే విషయం గుర్తించిన పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న మెడికల్ షాపులపై నిఘా పెట్టారు. ఇప్పటికే చాలా సార్లు టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నప్పటికీ.. వారిలో ఎలాంటి మార్పు లేదు. తరచుగా అదే పని చేస్తూ సులువుగా లక్షలు సంపాదిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ మార్గంలో నగరానికి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతే లక్ష్యంగా ఒక్కొక్క ఇంజెక్షన్ వందల్లో విక్రయిస్తునట్లు గుర్తించిన పోలీసులు....నిందితుడుతో పాటు ప్రసాద్, రాంప్రసాద్ అనే ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే 850 మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన కంచెరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


ఇటీవలే గుంటూరులోనూ డ్రగ్స్ కలకలం..


ఉగ్రవాద సంస్థలు తమ సభ్యులకు ఉత్ప్రేరకంగా వాడే మాదక ద్రవ్యాలు మందుల రూపంలో పల్నాడు నుంచి సప్లై అవుతున్నాయని పోలీసులు నెల రోజుల క్రితం గుర్తించారు. ఈ ఉత్ప్రేరకం మందులను నర్సారావుపేట ప్రాంతంలో ఉన్న ఫార్మసీ కంపెనీలో తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా భారీ ఎత్తున జరుగుతున్న ట్రెమడాల్ ట్యాబ్లెట్ల అక్రమ రవాణా గుట్టురట్టయింది. ఇప్పటికే కొన్ని వందల కోట్లలో ట్యాబ్లెట్లను అక్రమ రవాణా చేసినట్లు గుర్తించారు. ఉగ్రవాద సంస్థలు ఐసీస్, ఆఫ్రికా ప్రాంతంలోని బోకోహరమ్ లాంటి సంస్థలు ఈ మందులను విరివిగా ఆర్డర్ చేస్తూ ఉంటాయి. ఈ ఉగ్రవాద సంస్థలు తమ సభ్యులు అలసిపోకుండా నిరాటంకంగా పనిచేసేందుకు.. విధ్వంసాలకు ఒడిగట్టేందుకు  ఈ ట్రెమాడాల్ డ్రగ్ టాబ్లెట్ రూపంలో తీసుకుంటారు. నొప్పుల‌ నివారణ కోసం సూక్ష్మ మోతాదులో వాడేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కఠినమైన ఆంక్షలతో ఈ కాంబినేషన్ తో టాబ్లెట్ తయారీకి అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కాంబినేషన్ లో మాత్రమే తయారు చేయవలసి‌ ఉంటుంది. ట్రెమాడాల్ మాదక ద్రవ్యంగా ఎక్కువగా ఉపయోగిస్తాన్నారని ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.