Viazag Railway Zone In Andhra Pradesh | న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల. అయితే త్వరలోనే ఏపీ వాసుల కల సాకారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నందున త్వరలోనే రైల్వే జోన్ వస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సరైన సహకారం అందలేదన్నారు. భూమి కేటాయింపు సహా పలు అంశాలపై గత ప్రభుత్వం సహకరించలేదని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటుందని, త్వరలోనే రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 


సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం నిధులను కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కరించాలని, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై సైతం కేంద్రం పెద్దలతో చంద్రబాబు చర్చించారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్ర సర్కార్ సమన్వయం చేసుకుని ముందుకెళ్లడంతో రైల్వే జోన్ కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.