విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం రోజుకో రకంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు అనుకూలంగా మాట్లాడుతూనే, తెరవెనుక చేయాల్సిందంతా చేస్తూనే ఉంది. వారం రోజుల క్రితం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూనే ప్లాంటు ఊపిరి తీసే చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్పత్తి ప్రక్రియలో కీలకమైన బ్లాస్ట్‌ఫర్నేస్‌-3 ఏడాదిన్నరగా మూతపడింది. తాజాగా ముడిసరకు కొరతతో మరో ఫర్నేస్‌ షట్‌డౌన్‌ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉందని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఉన్న రెండు బ్లాస్ట్‌ఫర్నేస్‌లో రోజుకొకటి చొప్పున 12 గంటల పాటు నిర్వహణ పేరుతో నిలిపివేస్తున్నట్లు సమాచారం.


అసలే ఆర్థికసంక్షోభం
ప్రస్తుతం రెండు ఫర్నేస్‌లను నడిపించడానికి అవసరమైన ఇనుప ఖనిజాన్ని బహిరంగమార్కెట్‌లో కొనాలని చూస్తున్నా, నిధులు సమకూర్చుకోవడానికి తంటాలు పడాల్సి వస్తోంది. బ్యాంకువడ్డీలు, ఉద్యోగుల పీఎఫ్‌లు, పన్నులకు సైతం డబ్బుల్లేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అక్టోబరులో ఇప్పటి వరకు జీతాలివ్వలేదు. 8,900 మందికిపైగా కార్మికులు, 4,800 మందికిపైగా ఉద్యోగులకు సుమారు రూ.80 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.  అసలే ఆర్థికసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కుకు రూ.2వేల కోట్ల రుణసాయం చేసి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు. చివరకు కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులకూ కష్టాలు తప్పడం లేదు. 


రోజుకు 12 వేల టన్నులే ఉత్పత్తి 
నిత్యం 21 వేల టన్నుల ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ 19 నెలలుగా రోజుకు 12 వేల టన్నులే ఉత్పత్తి అవుతోంది. ఆరు నెలలుగా ఎన్‌ఎండీసీ నుంచి ఆశించినంత ఇనుప ఖనిజం సరఫరా జరగడం లేదు. కిరండోల్‌, బైలదిల్లా గనుల నుంచి రోజూ 4-5 రేక్‌ల ఇనుప ఖనిజం సరఫరా చేయాల్సి ఉంది.  ప్రతి రోజు రెండు రేక్‌లే మించి రావడం లేదని కార్మికులు చెబుతున్నారు. కర్ణాటకలోని గనుల నుంచి ఇనుప ఖనిజం తెచ్చుకోవాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యాని ఎన్‌ఎండీసీ సూచించింది. కర్ణాటక నుంచి ఇనుప ఖనిజం తెచ్చుకోవాలంటే ఆర్థికంగా భారంతో కూడుకున్న వ్యవహారం అవుతుంది. ప్రస్తుతం ప్లాంటులో రెండు రోజులకు సరపడా మాత్రమే ముడిసరకు నిల్వలు మాత్రమే ఉన్నాయి. 


రూ.2వేల కోట్ల మేర ఆర్థికసాయం కావాలి
మరోవైపు ప్లాంటు నుంచి ఉత్పత్తి ధరలకు స్టీలు కొనాలని, ముందుగా రూ.2వేల కోట్ల మేర ఆర్థికసాయం అందించాలని కార్మిక, ఉద్యోగసంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. అయితే జగన్‌ ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టిందనే విమర్శలు వస్తున్నాయి. సీఎంఓ నుంచి పరిశ్రమల మంత్రిత్వశాఖకు, అక్కడి నుంచి కమిషనరేట్‌కు లేఖలు పంపింది. చివరకు జిల్లా పరిశ్రమలశాఖ అధికారులకు ఆదేశాలిచ్చి సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యత అప్పగించారు. విశాఖ ఉక్కు నుంచి జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో రాష్ట్రానికి 9% వాటా కింద ఏటా వందల కోట్లు జమ అవుతోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చో, లేక రాష్ట్రప్రభుత్వ పథకాలకు అవసరమైన ఉక్కును ప్లాంటు నుంచి కొనుగోలు చేసో ఆదుకోవచ్చని కార్మికసంఘాలు అంటున్నాయి. మరోవైపు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండు చేస్తూ...కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 5న గాజువాకలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఎం నేతలు పిలుపునిచ్చారు.