Lokesh Yatra: స్పల్ప విరామం అనంతరం మరోసారి నారా లోకేశ్(Lokesh) నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. యువగళం పేరిట రాష్ట్రవ్యాప్తంగా 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన లోకేస్ ఇప్పుడు శంఖారావం అంటూ ప్రజల్లోకి వెళ్లనున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం(Ichapuram)లో తొలి బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అంతకు ముందు భారీ రోడ్ షోలో ఆయన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
సమర శంఖారావం
తెలుగుదేశం యువనేత, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Lokesh) నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇచ్ఛాపురం రాజావారి గ్రౌండ్స్ నుంచి ఆయన కొత్త యాత్ర శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలుత బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి(TDP) యాప్ లో ప్రతిభకనబర్చిన 50మంది కార్యకర్తలను ఆయన అభినందించనున్నారు లోకేష్ అభినందన. బహిరంగ సభ అనంతరం.. ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖిగా మాట్లాడనున్నారు. రానున్న ఎన్నికలకు ఎలా సమాయత్తమవ్వాలి.ప్రచారంలో ఏవిధంగా ముందుకు దూసుకుపోవాలి..ప్రత్యర్థిలకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్న సూచనలు చేయనున్నారు. అధికార పార్టీకి ఏమాత్రం భయపడొద్దని...తెలుగుదేశం అన్ని విధాల అండగా ఉంటుందని అభయమివ్వనున్నారు.రాబోయే ప్రభుత్వం తెలుగుదేశానిదేనని భరోసా కల్పించనున్నారు. ఇచ్ఛాపురంలో యాత్ర ముగించుకుని ఆయన మధ్యాహ్నానికి పలాస చేరుకోనున్నారు.
యువనేత లోకేష్ పలాస(Palasa) నియోజకవర్గానికి చేరి కోనున్నారు. భోజన విరామం అనంతరం ..అక్కడ నిర్వహించే బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించనున్నారు.చివరిగా సాయంత్రం టెక్కలి(Tekkali)లో నిర్వహించే బహిరంగ సభలో లోకేశ్ పాల్గొననున్నారు. మూడు బహిరంగ సభలు ముగించుకుని నరసన్నపేట శివారులోని జమ్ము గ్రామంలో లోకేశ్ బస చేయనున్నారు.
రోజుకు మూడు సభలు
ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో లోకేశ్ సైతం ప్రచార వేగం పెంచారు. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయన సరాసరి రోజుకు 15 కిలోమీటర్లు నడిచేవారు. ఒక్కో నియోజకవర్గంలోనే వారం రోజులకు పైగా యాత్ర కొనసాగించేవారు. కానీ ఇప్పుడు అంత సమయం లేకపోవడంతో ….ఒకేరోజు 3 నియోజకవర్గాలను కవర్ చేస్తున్నారు. బహిరంగ సభలు, కేడర్ తో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. యువగళం పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాల్లో ఈసారి లోకేశ్ శంఖారావం సభలు నిర్వహంచేలా ప్లాన్ చేశారు. ఈ విధంగా ఆయన దాదాపు 175 నియోజకవర్గాలు పర్యటించనున్నారు. నెలరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండటంతో ఈలోపు యాత్రను పూర్తిచేయనున్నారు.
ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే...సీట్ల సర్దుబాటు, పోలింగ్ ఏర్పాట్లు, అభ్యర్థులకు నగదు సర్దుబాటుతోపాటు చంద్రబాబు(CBN)తో కలిసి భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు వంటి చాలా కార్యక్రమాలు ఉండటంతో ఆయన ముందుగానే శంఖారావం యాత్రలకు శ్రీకారం చుట్టారు. యువగళం పాదయాత్రకు ఎక్కడలేని స్పందన రావడంతో...శంఖారావం బహిరంగ సభలను సైతం అదే విధంగా విజయవంతం చేసేలా తెలుగుదేశం పార్టీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్తరాంధ్ర పర్యటన కోసం ఇప్పటికే లోకేశ్ విశాఖ(VIZAG) చేరుకోగా....పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా రోడ్డుమార్గంలో ఇచ్చాపురం వెళ్లారు. మొదటి విడతలో 11 రోజుల పాటు రోజుకు మూడు చొప్పున ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో లోకేశ్ సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. మొత్తం '120 నియోజకవర్గాల్లో 40 రోజులు శంఖారావం కొనసాగుతుంది.