Visakhapatnam Airport News: తరచూ విశాఖపట్నానికి విమానంలో రాకపోకలు సాగించే వారికి అలర్ట్. త్వరలో విశాఖపట్నం విమానాశ్రయాన్ని రాత్రి వేళ మూసివేయనున్నారు. ఈ నెల 15 నుంచి ఈ మూసివేత అమలు అవుతుందని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. ఎయిర్ పోర్టు రన్‌ వే పునరుద్ధరణ పనులు చేయాల్సి ఉందని, అందుకోసం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎయిర్ పోర్టును పూర్తిగా మూసివేయనున్నట్టుగా వెల్లడించారు. రాత్రిపూట విమానాలు ఏవీ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరడం గానీ, రావడం కానీ ఉండదని స్పష్టం చేశారు. ఈ రన్‌ వే పునరుద్ధరణ పనులు పూర్తి అవ్వడానికి దాదాపు 4 నుంచి 6 నెలల టైం పడుతుందని ఎయిర్ పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు.


ఎయిర్ పోర్టును రాత్రిపూట మూసివేయడం వల్ల పగటిపూట విమాన సర్వీసులు పెంచాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. రాత్రిపూట విమానాశ్రయం మూసివేయడంపైన ఇండియన్ నేవీ అధికారులతో కూడా చర్చించారు. రన్‌ వే పనుల కోసం రాత్రిపూట ఎయిర్ పోర్టును మూసివేయడం తప్పదని ఈఎన్సీ చీఫ్‌ కూడా చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పగటిపూట సర్వీసులు పెంచుకోవడానికి అంగీకరించినట్లుగా చెప్పారు.