విశాఖ రుషికొండలో రేడియంట్ సంస్థకు కేటాయించిన భూముల ఒప్పందం వెనుక రూ.1000 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి ప్రోద్భలంతో మధురవాడలో సర్వే నెం 336 లో ఈ కుంభకోణం జరిగిందన్నారు. మధురవాడలో జరిగిన ఈ వెయ్యికోట్ల పైగా భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
సీఎం జగన్ సతీమణి, సోదరుడుపై ఆరోపణలు
మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రేడియంట్ భూముల వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ కు వరుసకు సోదరుడైన అనిల్‌రెడ్డి, సీఎం సతీమణి భారతిరెడ్డి ప్రోద్బలంతో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఇందులో హస్తం ఉందని ఆరోపించారు. రేడియంట్ సంస్థకు చెందిన రమేష్ కుమార్‌కు సర్వే నంబరు 336లో 50 ఎకరాల భూములను అప్పగించాలని, అందుకు ఆయన వీఎంఆర్‌డీఏకు రూ.93 కోట్లు చెల్లించాలని 2019లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో రిజిస్ట్రేషన్ జరగలేదని, ఆ తరువాత ఏపీలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం రేడియంట్ భూములను ఆక్రమించుకోవాలని చూసిందని ఆరోపించారు.
రమేష్ కుమార్ కు రిజిస్ట్రేషన్ చేయకుండా.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన వీపీఆర్ ఇన్‌ఫ్రాతో రేడియంట్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ముందడుగు పడిందన్నారు. కానీ 2019 లో 93 కోట్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రమేష్ కుమార్ కు చెందాల్సిన భూమిపై కుట్ర జరిగిందని, మూడున్నరేళ్లు తర్వాత ఇప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ కు తమ్ముడైన అనీల్ రెడ్డికి క్యాపిటల్ లక్ష్య పేరుతో ప్రకటన ఇవ్వడంతో కుట్ర బయట పడిందన్నారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని, బీజేపీ ఎంపీ జీవీఎల్ కు మొత్తం వివరాలు అందజేస్తామని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చేలోపే విచారణకు ఆదేశించాలని కోరారు.
రూ.1000 కోట్ల కుంభకోణం ఎలాగంటే.. !
ఇటీవల జరిగిన ఎంవోయూలో 50 ఎకరాలలో 32 ఎకరాలు విల్లాకు, మరో 8.82 ఎకరాల్లో హైరైజ్ భవనాలు, మిగతా భూములను రిజర్వ్ లో ఉంచినట్లు లే అవుట్‌లో చూపించారు. చదరపు అడుగుకు రూ.12,500- 13 వేల ఖర్చుతో మొత్తం 135 విల్లాలు నిర్మాణం చేపడతామని క్యాపిటల్ లక్స్ అక్టోబర్ 30న ప్రకటనలు ఇచ్చింది. అయితే ఆ సంస్థ సీఎం జగన్ కు సోదరుడైన అనిల్ రెడ్డిది అని, కనుక క్యాపిటల్ లక్స్‌కు, ఒప్పందం చేసుకున్న వీపీఆర్ ఇన్‌ఫ్రాకు సంబంధం ఏమిటో చెప్పాలని టీడీపీ నేత బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. అయితే మొత్తం వ్యాపార విలువ రూ.700 కోట్లుగా చూపారని, అయితే క్యాపిటల్ లక్స్ ఇచ్చిన ప్రకటన గమనిస్తే దాని విలువ సుమారు రూ.1700 కోట్ల వరకు ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో రేడియంట్ భూములపై వెయ్యి కోట్ల వరకు కుంభకోణం జరిగి ఉంటుందని ఆరోపించారు.
వైసీపీ నేతలు విశాఖలో భూములను అడ్డగోలుగా దోచుకుంటున్నారని, వారు చేస్తున్న భూదందాలు మీద పోరాటం కొనసాగిస్తామన్నారు విశాఖ లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. కేవలం ఇక్కడి భూములు దోచుకోవడానికి విశాఖను రాజధాని చేస్తున్నారేమోనని అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో వైసీపీ నేతలు భూ దందాలు చేస్తున్నారని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆరోపించారు. ముగ్గురు వైసీపీ ఎంపీలు భూ దందాలు చేయగా, ఇప్పుడు సీఎం జగన్ బినామీ అనిల్ రెడ్డి విశాఖలో అడుగుపెట్టారంటూ మండిపడ్డారు. విశాఖలో ఈ స్థిరాస్తి కొనుగోలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని, రేపు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ భూ కుంభకోణాలు పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.