మరో నెల రోజులో తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైలు రానుంది. రైల్వే శాఖ అత్యంత ప్రతిష్టాత్మకం గా నడుపుతున్న వందే భారత్ రైలు రాకపట్ల తెలుగు ప్రజలు ఎంతో ఆశక్తి తో ఉన్నారు. అయితే దాదాపు పాతికేళ్ల క్రితమే ఇలాంటి ఒక ప్రయోగం రాజమండ్రి -సికింద్రాబాద్ ల మధ్య జరిగింది అని చాలా మందికి తెలియక పోవచ్చు. ఈ రెండు ప్రాంతాల మధ్య అత్యంత వేగంతో నడిచే పూర్తి ఏసీ  ట్రైన్ ఒకటి తిరిగేది. అదే రాజమండ్రి - సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ ప్రెస్.


నాటి లోక్ సభ స్పీకర్ బాలయోగి పట్టుబట్టి మరీ తెచ్చిన రాజమండ్రి శతాబ్ది 
అప్పట్లో అంటే 1999 నాటికి రాజమండ్రిని టచ్ చేస్తూ హైదరాబాద్ వెళ్లే రైళ్లు చాలా తక్కువ ఉండేవి. ముఖ్యంగా విశాఖ నుండి హైదరాబాద్ వెళ్లే గోదావరి, కాకినాడ నుండి సికింద్రాబాద్ వెళ్లే గౌతమి ఎక్స్ ప్రెస్ లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవి. అప్పట్లో పలాస నుండి కాచిగూడ వెళ్లే విశాఖ ఎక్స్ ప్రెస్ నిడదవోలు నుండి భీమవరం రూట్ లో వెళ్ళేది.హౌరా నుండి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు ఏపీ కోటాలో రిజర్వేషన్ లో టికెట్స్ చాలా తక్కువ ఉండేవి. దానితో ఈ రెండు రైళ్లలో రాజమండ్రి నుండి  టికెట్స్ అందుబాటులో ఉండేవి కావు. హౌరా నుండి హైదరాబాద్ వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లోనూ అదే పరిస్థితి పైగా అదే పగటిపూట వెళ్లే ట్రైన్. దానిలో హైదరాబాద్ కు  పని మీద వెళ్లాలంటే ఒకరోజంతా వేస్ట్ అయ్యేది. ఇక ఇప్పటిలా విమాన సర్వీసులూ రోజూ ఉండేవికావు. వారానికి ఒకటి లేదా రెండు సర్వీసులే ఉండేవి. ఇవన్నీ ఆలోచించి రాజమండ్రికి హైదరాబద్ నుండి ఒక సూపర్ స్పీడ్ ఎక్స్ ప్రెస్ ఉంటే బాగుంటుంది అని భావించారు నాటి లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి. 


వ్యాపారస్తులు - సినిమా వాళ్లే లక్ష్యంగా రాజమండ్రి శతాబ్ది ఎక్స్ ప్రెస్  
అప్పట్లో బస్ సర్వీసులు కూడా హైదరాబాద్ కు తక్కువ ఉండేవి. కానీ రాజమండ్రి చుట్టుపక్కల సినిమా షూటింగ్ లు  ఎక్కువగా జరుగుతుండేవి. ముఖ్యంగా నాటి  బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సుమన్, రాజశేఖర్, శ్రీకాంత్, జగపతిబాబు, వడ్డే నవీన్ జేడీ చక్రవర్తి లాంటి హీరోల సినిమాలు, కే. రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి, యశ్వీ కృష్ణారెడ్డి, ముత్యాల సుబ్బయ్య, ఈవీవీ సత్యనారాయణ, కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ ల షూటింగ్ లు ఎక్కువగా గోదావరి జిల్లాల్లోనే జరిగేవి. ఇది కాకుండా రాజమండ్రి అంటే బంగారం వ్యాపారానికి పెట్టింది పేరు. దానితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన తణుకు ,తాడేపల్లి గూడెం లలోనూ ఈ వ్యాపారం ఎక్కువగా సాగుతుంది. ఆ వ్యాపారస్తులు కనీసం రెండు రోజులకోసారైనా హైదరాబాద్ -రాజమండ్రి మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ అందుబాటులో ఉండేలా బాలయోగి రైల్వే శాఖతో అనేక సమాలోచనలు జరిపి పట్టుదలతో రప్పించిన ట్రైన్ రాజమండ్రి శతాబ్ది. 




రాజమండ్రి - సికింద్రాబాద్ మధ్య మూడే స్టాపులు 
సికింద్రాబాద్ - రాజమండ్రి మధ్య 19 ఫిబ్రవరి 1999 న ప్రారంభమైన శతాబ్ది ఎక్స్ ప్రెస్ 6 ఏసీ కోచ్ లతో ప్రారంభమైంది. ఇవి కాక మరో రెండు జెనరేటర్ కార్లు ఉండేవి. ఈ ట్రైన్ నెంబర్ 2031/2034. ట్రైన్ లోకి ఎంటర్ కాగానే ప్రయాణీకుల కోసం  ప్రతీ సీట్ వద్దా చాక్లెట్లూ , బిస్కట్లూ ఉంచేవారు. ప్రతీ ప్యాసింజర్ వద్దకూ ట్రైన్ సూపరెండెంట్ వచ్చి అంతా కంఫర్ట్ గా ఉందా అని అడిగేవారు. విచిత్రం ఏంటంటే ఒక్క ఇంజన్ తప్పిస్తే, మొత్తం ట్రైన్ కోచెస్ అన్నీ ఇప్పటి వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీల్లానే ఉండేవి. తెల్లరంగులో నిగనిగలాడే రాజమండ్రి శతాబ్ది ట్రైన్ ను చూడడం కోసం చుట్టుపక్కల ప్రాంతాల వారు రాజమండ్రి స్టేషన్ వద్దకు వచ్చిన జ్ఞాపకాలు వారి మదిలో ఇంకా ఉన్నాయి. ట్రైన్ జర్నీ మొత్తం ప్రయాణికుల కోరిక మేరకు లైట్ మ్యూజిక్ ను ప్లే చేసేవారు. అలానే రైలు కదలడానికి ముందు రాజమండ్రి చరిత్ర, గోదావరి నది గొప్పదనం, సికింద్రాబాద్ - హైదరాబాద్ ల హిస్టరీ వీటి గురించి ట్రైన్ సూపరెండెంట్ కొద్దిగా బ్రీఫింగ్ ఇచ్చేవారు. 


ట్రైన్ కదలగానే భోజనం, అది వద్దు అనేవారికి వేడి వేడిగా కాఫీ ఇచ్చేవారు. రాజమండ్రిలో కదిలితే మళ్ళీ విజయవాడ లోనే ఆగేది ట్రైన్. అక్కడ మళ్ళీ కాఫీ గానీ టీ గాని ఇచ్చి.. సికంద్రాబాద్ చేరుతుంది అనగా రెండు న్యూస్ పేపర్స్ తెలుగు ఒకటి ,ఇంగ్లీష్ ఒకటి ఇచ్చేవారు .అలానే దిగేముందు ట్రైన్ సూపరెండెంట్ వచ్చి అందరికీ థాంక్స్ చెప్పేవారు. దాదాపు ఫ్లైట్ జర్నీ లో ఎలాంటి సౌకర్యాలు ఉండేవో శతాబ్ది లోనూ అవే సౌకర్యాలు ఉండేవి. సాధారణ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు అప్పట్లో రాజమండ్రి నుండి సికింద్రాబాద్ కు దాదాపు 9 నుంచి 10 గంటల సమయం తీసుకుంటే  శతాబ్ది మాత్రం కేవలం 7-  ఏడున్నర గంటల్లో ప్రయాణం ముగించేది.మొదట్లో విజయవాడ ఒక్కటే స్టాప్ ఉండేది కానీ తరువాత ఏలూరు ,వరంగల్ లలో కూడా ఆగేది ట్రైన్. 


కేవలం 11 నెలలు మాత్రమే నడిచిన ఈ రైలు ఎందుకు రద్దయ్యిందో తెలుసా ?
ఈ ట్రైన్ కోసం ఏకంగా లోక్ సభ స్పీకర్ పట్టుబట్టడం.. అప్పట్లో  ఏపీ ప్రభుత్వం కేంద్రం లో చక్రం తిప్పుతూ ఉండడంతో హడావుడిగా ఈ ట్రైన్ ను ప్రారంభించారు అనే విమర్శలు ఉన్నాయి. కాగ్ సైతం దీనిని ప్రస్తావించింది అంటారు నాటి రాజకీయవేత్తలు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ ట్రైన్ రద్దు కావడానికి ప్రధాన కారణం దీని టైమింగ్స్. సాయంత్రం 5 గంటలకు  కు సికింద్రాబాద్ లో బయలుదేరే ఈ ట్రైన్  రాత్రి 12 గంటలకు రాజమండ్రి  చేరుకునేది. వెంటనే 12:30 కు రాజమండ్రిలో బయలుదేరి ఉదయం 7:30 కల్లా సికంద్రాబాద్ చేరేది . స్పీడ్ విషయంలో బాగానే ఉన్నా.. ఆ టైమింగ్స్ మాత్రం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉండేవి . పైగా అర్ధరాత్రి భోజనం అనే కాన్సెప్ట్ అట్టర్ ప్లాప్ అయింది. టికెట్ ధర 600 వరకూ ఉండేది. దానితో మొదట్లో రెస్పాన్స్ బానే ఉన్నా తరువాత ఒక్కసారిగా ఆక్యుపెన్సీ పడిపోయింది. 11 నెలల పాటు నడిచిన ఈ ట్రైన్ వల్ల నష్టాలు అధికంగా రావడంతో దీనిని రైల్వే శాఖ రద్దు చేసింది. 
1999 ఫిబ్రవరి లో ప్రారంభమైన ఈ ట్రైన్ ను అదే ఏడాది డిసెంబర్ లో రద్దు చేశారు. రద్దు చేసేముందు దీనిని కాకినాడ వరకూ పొడిగించి చూసినా ఆ టైమింగ్స్ ఎవరికీ కుదరకపోవడంతో ఆక్యుపెన్సీ పెరగలేదు. నాటి  రిపోర్ట్స్  ప్రకారం రాజమండ్రి శతాబ్దికి ఆ 11 నెలల్లో వచ్చిన ఆదాయం 17 మిలియన్ లు అయితే అయిన ఖర్చు 58 మిలియన్ లు . అంత నష్టాన్ని ఒక్క రైలు మీద భరించలేక రైల్వే శాఖ ఈ ట్రైన్ ను నిలిపి వేసింది . ఎలాంటి ట్రాఫిక్ సర్వే గానీ ,ఫీజుబులిటీ స్టడీస్ గానీ లేకుండానే హాడావుడిగా ఈ ట్రైన్ ను ప్రారంభించారని తరువాతి కాలంలో కాగ్ కూడా తప్పుబట్టింది. ఏదేమైనా ఎంతో సక్సెస్ కావాల్సిన రాజమండ్రి శతాబ్ది ట్రైన్ కేవలం సరైన టైమింగ్స్ కేటాయించకపోవడం వల్ల ఫెయిల్ అయింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పరుగులుపెట్టడానికి సిద్ధం అవుతున్న  వందే భారత్ ట్రైన్ విషయంలో అలాంటి పొరబాట్లు జరగకూడదని ఆశిద్దాం.