Jagan Case : ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీఎం వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి కేసు విచారణ .. విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరిగింది. తదుపరి విచారణను ఇరవయ్యే తేదీకి కోర్టు వాయిదా వేసింది. రాజమండ్రి జైల్ లో ఉన్న నిందితుడు శ్రీనివాస్ అభ్యర్థన మేరకు.. విశాఖ సెంట్రల్ జైలు కు పంపాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కోడికత్తి కేసు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనను ప్రతీ వాయిదాకు రాజమండ్రి నుంచి విశాఖ తీసుకు రావాల్సి వస్తోంది. విచారణోల సీఎం జగన్ ముఖ్యమైన పదవి లో ఉన్నందున ఆయనకు అడ్వకేట్ కమీషన్ ను నియమించుకునే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరిన జగన్ తరపు న్యాయవాది కోరారు. కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
జగన్‍పై దాడి జరిగిన రోజు కోడి కత్తితో చేసినట్లు ఏ సాక్షి లేరని నిందితుడి తరపు లాయర్ చెబుతున్నారు. సాక్షులుగా ఉన్నవాళ్లు కూడా కత్తితో దాడిచేసినట్లు చూడలేదని చెబుతున్నారన్నారు. ఈ కేసులలో మజ్జి శ్రీనే అన్ని అయి ఉన్నాడని.. మజ్జి శ్రీను తన ఫోన్ విచారణ అధికారులకు ఎందుకు డిపాజిట్ చేయలేదని లాయర్ సలీం ప్రశ్నించారు. మావద్ద అన్ని ఆధారాలున్నాయని.. సమయం వచ్చినప్పుడు అందిస్తామన్నారు. కుమార్తెపై ప్రేమతో సీఎం వేల కి.మీ. వెళ్లారని.. రాష్ట్రంలో ఉన్న విశాఖకు రాలేరా? అని ప్రశ్నించారు. ఒక ఎస్సీ బిడ్డను నాలుగున్నరేళ్లుగా మగ్గిపోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనుపల్లి శ్రీనివాస్ పుడ్ కోర్టులో అనుమతితోనే పనిచేస్తున్నారని.. - ఐదుగురు వైసీపీ నేతలు పాస్ లేకుండానే ప్రవేశించిన విషయం కోర్టు ముందుంచుతున్నామని ప్రకటించారు. ఆ రోజు పోలీస్ స్ట్రెకింగ్ ఫోర్స్ జీపుపై వైసీపీ నేతలు దాడి చేశారని - దాడిచేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిందితులు శ్రీను తరపు న్యాయవాది సలీం ప్రశ్నించారు.
ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. 2018లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయనపై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో దాడి జరిగింది.. ఈ కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించారు. అప్పటి నుంచి శ్రీనివాసరావు జైల్లో ఉన్నారు. హత్యలు చేసినవాళ్లు బయట తిరిగేస్తున్నారని.. రోడ్డుమీద చంపేసి మూట కట్టేసి పడేసినోళ్లకు బెయిల్ ఇచ్చారన్నారు. తన కొడుకు ఏ తప్పు చేయపోయినా నాలుగున్నరేళ్లుగా జైల్లో ఉన్నాడని నిందితుడి తల్లి కన్నీరు పెట్టుకుంటున్నారు. తన కుమారుడు ఇంటికొచ్చేస్తాడనే నమ్ముతున్నామని.. చివరిరోజుల్లో కొడుకు తమ దగ్గర ఉండాలని కోరుకుంటున్నానని అంటున్నారు. తన కుమారుడికి బెయిల్ ఇప్పించాలన రెండు సార్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు.. రాష్ట్రపతికి కూడా ఆమె లేఖ రాశారు.
ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ విచారణలో తేల్చినప్పటికీ ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదని నిందితుడి తరపు లాయర్ ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో సీఎం వైఎస్ జగన్ ఎన్‌వోసీ అయినా ఇవ్వాలి లేదా వచ్చి వాదనలు అయినా వినిపించాలి అని కోరుతున్నారు. బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు వచ్చి స్టేట్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఒక్క సారి కోర్టుకు వచ్చి జరిగింది చెప్పాలని గతంలో కోర్టు ఆదేశించినా హాజరు కాలేదు. తాను ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నానని.. తాను కోర్టుకు వస్తే కక్షిదారులకు ఇబ్బంది అవుతుందని ఆయన తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ తేల్చి చెప్పినప్పటికీ సీఎం జగన్ కోర్టుకు హాజరుకాకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటని నిందితుడి తరపు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు.
బాధితుడు అయిన సీఎం జగన్ కోర్టుకు వచ్చి స్టేట్ మెంట్ ఇచ్చినా.. లేకపోతే నిందితుడికి బెయిల్ ఇచ్చినా అభ్యంతరం లేదని ఎన్వోసీ ఇచ్చినా నిందితుడు బయటకు వస్తారని ఆయన బంధువులు అంటున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం .. తనపై దాడి వెనుక లోతైన కుట్ర ఉందని.. మరింతగా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.