తరాలు మారుతున్నా ఆ గ్రామ తలరాత మారడం లేదు. బతుకుల మాట ఏలా ఉన్నా.. వందేళ్ల క్రితం గ్రామం పుట్టినా  ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. గాంధీజీ కన్న కలలను నిజం చేసేశాం.. చేసేస్తున్నాం అంటు గొప్పలు చెప్పే పాలకులు ఒక్కసారైనా ఆ గ్రామం సందర్శించాల్సిందే. డిజిటల్ ఇండియాలో ప్రతి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పే నేతలు ఆ ఊరి ప్రజల గోడు వినాల్సిందే. అక్కడ ఊరు ఉందన్న విషయాన్ని అధికారులు మర్చిపోయినట్లు తమ పరిస్థితి మారిందని ఆవేదన గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. 


ఇది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం దామోదర పురం. ఈ గ్రామమేదో ఎత్తైన శిఖరాలపైన ఉన్న గిరిజన గ్రామంకాదు. చుట్టునీరు ఉన్న లంకగ్రామం అంతకన్నా కాదు. ఊరూ చిన్నదికాదు. అలా అని 16వ నెంబరు జాతీయ రహాదారికి మైళ్ల దూరంకాదు. 200 జనాభా ఉంది. సోంపేట మండలంలోని టి.శాసనం సమీపంలోని జాతీయ రహాదారికి 5 కిలో మీటర్ల దూరంలోనే దామోదర గ్రామం ఉంది. పాలకులు, అధికారులు ఎవరు ఆ గ్రామం కోసం ఆలోచించట్లేదు. నేటితరం వారైతే పుట్టిన ఊరు పేరు గర్వంగా చెప్పుకోలేక పోతున్నామంటున్నారు. కనీసం రోడ్డుకైనా నిధులు సమకూర్చకపోవడం ఆందోళన  కలుగుతుందంటున్నారు. 


సంబంధాలకూ వెనుకంజ
గ్రామంలోని ఆడ పిల్లలకు పెళ్లిచేయాలన్నా అమ్మో ఆ గ్రామానికి రోడ్డేలేదు.. బడి లేదు.. అంటూ వెనక్కుపోతున్నారని ఆ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఊరి ఆడపిల్లను పెళ్లి చేసుకొనేందుకు ఇతర గ్రామస్తులు ఇష్టం చూపడం లేదని ఓ వృద్ధురాలు ఆవేదన చెందింది. 


‘‘వందేళ్లక్రితం ఊరు పుట్టింది. 1970 నుంచి చూస్తున్నా ఊరు సమస్య ఒక్కటి పరిష్కౌరం కావడం లేదు. చదువు, అంగన్వాడీ సరకులు ఇలా అన్నింటికీ తురక శాసనం పైనే ఆధారపడుతున్నాం. వర్షాకాలంలో ఎవరికైనా అనారోగ్యమైతే జాతీయ రహదారివరకు డోలిని మోసుకునే వెళ్తాం. ఎన్ఆర్ఈజీఎస్ నిధులుతో కొత్తగా వెలుస్తున్న కాలనీలకు రోడ్డు వేస్తున్న పాలకులు మా గ్రామంవైపు చూడడం లేదు. పంచాయతీ, ఇతర పథకాల ద్వారా నిధులు మంజూరవుతున్నా  హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయే తప్ప ప్రజలు ఎన్నిసార్లు వేడుకొన్నా.. కాళ్ళ వేళ్ళ పడినా రోడ్డు నిర్మాణం కోసం ఎవరూ దయచూపడం లేదు.’’ అని ఆ వృద్ధురాలు ఆవేదన చెందింది.


గతంలో ఎన్నికలను కూడా ఆ గ్రామస్తులు బహిష్కరించారు. అప్పుడు ఇరు పార్టీల నేతలు కూడా హామీ ఇచ్చారు గాని ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. గ్రామస్తులు పైసా పైసా చందాలు చేసుకొని రైతుల నుంచి రోడ్డు మార్గానికి అవసరమైన స్థలాన్ని సేకరించి మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టుకున్నారు. ఊర్లో ప్రాథమిక పాఠశాల కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించవచ్చు గానీ.. అంతకుమించి మినీ అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎమ్మెల్యే ఎవరైనా తమ తలరాత మారడం లేదని దామోదర పురం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.


ఉప్పు నీటితోనూ సమస్యలు


మహేంద్ర నది తీరాన ఉన్నా గుక్కెడు మంచి నీటి కోసం వారు పడే వేదన అంతా ఇంతా కాదు. సముద్రపు అలల తాకిడితో నదిలోకి సముద్రం నీరు ఎగదన్నితే ఉప్పు నీరే గతి. తద్వారా పంటలు కూడా నష్టపోతున్నారు. ‘‘ప్రస్తుతం జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ మా ప్రాంత వాసి. ఆమె భర్త పిరియా సాయిరాజ్ కూడా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన  దృష్టికి కూడా అనేక పర్యాయాలు తీసుకెళ్ళాం. కలెక్టర్ వద్దకు కూడా ఎన్నోసార్లు వెళ్ళాం. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా అయినా రోడ్డు వేస్తే పిల్లలైనా బయటికి వెళ్లి చదువుకోడానికి వీలు పడుతుంది అన్నా ఒక్కరంటే ఒక్కరు మా గోడు పట్టించుకోలేదు. ఇప్పటికైనా జెడ్పీ చైర్ పర్సన్ విజయ మా ప్రాంతాన్ని పరిశీలించి ప్రజల కష్టాలు తీర్చడంలో భాగస్వామి అవుతారని ఆశిస్తున్నాం.’’ అని గ్రామస్థులు వాపోయారు.