Srikakulam News: రాష్ట్రంలోనే సుదూర తీర ప్రాంతమున్న సిక్కోలులో మరో ఉద్యమానికి గంగపుత్రులు సిద్దమవుతున్నారు. జిల్లాలో మత్స్యసంపద కొరవడడం, జెట్టీల నిర్మాణం లేకపోవడంతో మత్స్యకారులు వలస బాట పడుతున్నారు. గత కొన్నేళ్లుగా మింగుడు పడనప్పటికీ బతుకు జీవుడా అంటూ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళకు స్థానిక మత్స్యకారులు వలస పోతున్నారు. ఈ ప్రాంతంలో జెట్టీల నిర్మాణం చేపడితే తమ బతుకులు బాగుపడతాయని మొరపెడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.


భావనపాడు పోర్టు స్థానంలో మూలపేట వద్ద పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చేనెలలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్టుప్రచారం సాగుతోంది. తీర - ప్రాంతాన్ని పరిరక్షించుకోవడంతోపాటు ఇతర ప్రాంతాల్లో పోర్టుల నిర్మాణం వల్ల జరిగిన నష్టాన్ని మత్స్యకారులకు వివరించేందుకు నేషనల్ ప్లాట్ఫారం ఫర్ స్మాల్ స్కేల్ ఫిష్ వర్కర్స్ (ఎన్పీఎస్ఎస్ఎఫ్ డబ్ల్యూ) సన్నద్ధమవుతోంది. 


జిల్లాలో పరిశ్రమల వల్ల ఎదురవుతున్న నష్టాలతో పాటు మత్స్యకారులు పడుతున్న కష్టాలను ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సులో జాతీయ నాయకులకు ఓ నివేదికను జిల్లాకు చెందిన మత్స్యకారులు అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా జెట్టీలు కట్టాలని వేడుకుంటున్నా ఏ ప్రభుత్వం తమ గోడును పట్టించుకోలేదని దీనివల్లే మత్స్యకార ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వలసలు పోతున్నామని జాతీయ నాయకుల దృష్టికి జిల్లా సంఘం తీసుకువెళ్లింది. మత్స్య రంగం ఒకప్పుడు బంగారు బాతులా ఉండగా, నేడు సముద్రంలోకి మైళ్ల దూరం వెళ్లినా చేపల వేట సాగే పరిస్థితి లేదు. "సముద్రం మాది.. సంపద మాది" అనే నినాదంతో ముందుకు వెళ్లకపోతే రానున్న రోజుల్లో కథగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వల పట్టుకుని గతంలో సముద్రంలో దిగితే చేపలు పడేవని, ఇప్పుడు చేపలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రతి మత్స్యకారుడు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో చర్చ సాగినట్టు జిల్లాకు చెందిన మత్స్యకార సంఘ నాయకుడు చింతపల్లి సూర్యనారాయణ పేర్కొన్నారు. 


ఈ మేరకు సముద్రంలో గతంలో ఉన్న రాక్షస బల్లులు, డ్రాగన్, కొన్ని జాతుల పక్షులు, జంతువులు ఎలా కనుమరుగయ్యాయో పాలకులు చెప్పాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. తెప్పలతో వెళితే వేట సాగేదని, ఇప్పుడు చేపలు లభ్యం కావడం లేదో పాలకులు గమనించాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు జిల్లాలో తీసుకుంటే రణస్థలం మండలంలోని మత్స్యకార గ్రామాలైన దోనిపేట, గురయ్యపేట, పోతయ్యపేట, కొవ్వాడ మత్స్యలేశం, అల్లివలస, జీరుపాలెం, జగన్నాథపురం, కొత్త ముక్కాం గ్రామాలు పైడి భీమవరం వద్ద ఉన్న కెమికల్ పరిశ్రమల వల్ల మత్స్య సంపదకు విఘాతం వాటిల్లుతోందని వాపోయారు. గతంలో ఈ పరిశ్రమలకు వ్యతిరేకంగా ఉద్యమించామని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నప్పుడు మసిపూసి మారెడుకాయ చేస్తుంది తప్ప గంగపుత్రులకు న్యాయం చేసే పరిస్థితి లేదన్న అసంతృప్తి వారిలో నిరంతరం వెంటాడుతోంది. 


ఇక పోర్టుల విషయానికి వస్తే గంగవరం, కృష్ణపట్నం పోర్టుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని అభిప్రాయపడుతున్నారు. పోర్టు బాధితులు సముద్రంలో 20 నుంచి 30 కిలోమీటర్లు దూరం వెళ్లి ఆ ప్రాంతంలో వేటకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, దీన్ని ఎన్పీఎస్- ఎస్ఎఫ్ఎడబ్ల్యూ గుర్తించిందన్నారు. పోర్టు వల్ల ఎక్కడ కూడా మత్స్యకారులు లాభపడే పరిస్థితి లేదని, అనేక నష్టాలనే ఎదుర్కొంటున్నట్టు ఈ సంఘం గుర్తించిందన్నారు. కార్పొరేట్ సంస్థలైన అదాని, అంబానీలకు సముద్రాన్ని ధారదత్తం చేయొద్దని ఈ సంఘం కోరుతోందని ఆయన పేర్కొన్నాడు. జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులను చైతన్యపరుస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గంగపుత్రులను ఆదుకునేందుకు జెట్టీలను నిర్మించి జిల్లా నుంచి మత్స్యకారుల వలసలు అరికట్టేందుకు కృషి చేయాలని సూర్యనారాయణ కోరుతున్నారు.