ప్రతీ ఏటా వైభవంగా జరిగే సింహాచలం అప్పన్న చందనోత్సవం ఈ రోజు (ఏప్రిల్ 23) ఉదయం 4 గంటల నుండి మొదలైంది. స్వామి నిజరూపదర్శనం చేసుకునే అవకాశం కలగడం దానికి ఆదివారం సెలవు రోజు కలిసి కావడంతో భక్తులు భారీగా సింహాచలం కొండకు తరలివస్తున్నారు. రాత్రి 7 గంటల వరకూ లైన్లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని విశాఖ  జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు. ఈ ఏడాది 11 లక్షల మంది వరకూ భక్తులు సింహాచలం స్వామి దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసారు. అసలే వేసవి కాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ భక్తుల కోసం మంచినీరు, మజ్జిగ పేకెట్ లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. 1500,1000 రూపాయల టికెట్స్ కొన్నవారి కోసం ప్రత్యేక దర్శనం అవకాశం ఉంటుందని అలాగే వీఐపీల దర్శనాల వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశామని దేవాలయ అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు 300 రూపాయల టికెట్స్, ఉచిత దర్శనాలు కూడా ఉన్నాయి.


కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం 


సింహాచలం కొండపైకి వచ్చే భక్తుల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు అధికారులు తెలిపారు. గోశాల ప్రాంతం నుండి దేవస్థానానికి చెందిన 4 బస్సులతో పాటు ఆర్టీసీ కి చెందిన 56 బస్సులను ఉదయం నుండి ఉచితంగా నడుపుతున్నారు. అలాగే హనుమంత వాక ఘాట్ రోడ్డు లో కూడా కొన్ని మినీ బస్సులను నడుపుతున్నారు. ప్రోటోకాల్ పరిధిలో ఉండే వీఐపీ లకు మాత్రమే సొంత వాహనాల్లో కొండపైకి వచ్చే అవకాశం ఇచ్చారు.


ప్రసాదాలు కొండ క్రిందనే


ఈ ఏడాది సింహాచలం వరాహ లక్ష్మీ నారాయణ స్వామి ప్రసాదాలను కొండపైన కౌంటర్ల లో అమ్మడం లేదు. కొండ కింద గోశాల, పాత అడవివరం జంక్షన్ ల దగ్గర కౌంటర్లలో అమ్ముతున్నారు. అలాగే పిఠాపురానికి చెందిన శ్రీ పాద భావనాచార్యుల మహా అన్నదాన ట్రస్ట్ వారు 40 వేల మందికి చక్కర పొంగలి, కదంబం లాంటి ప్రసాదాలు పంచిపెడుతున్నారు. అలాగే ఎండను దృష్టి పెట్టుకుని 50కి పైగా స్వచ్చంద సంస్థలు కొండా క్రింద నీరు, ORS పేకెట్లను పంచిపెడుతున్నారు.


అంతరాలయ దర్శనం 6 వేలమందికే


ఈసారి అప్పన్న స్వామి అంతరాలయ దర్శనం 6 వేలమందికే కల్పిస్తున్నారు. పోయినేడాది 5 వేలమందికి అంతరాలయ దర్శనం కల్పించామని ఈ ఏడు మరో వెయ్యి మందికి మాత్రమే అదనంగా అంతరాలయ దర్శనం కల్పించగలమని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ సంఖ్యను తప్పకుండా పెంచుతామని వారు అంటున్నారు.