Parvatipuram Manyam District News : ఓవైపు భారీగా పెరిగిన ఇంధన ధరలు.. మరోవైపు పన్నుల పెంపు. వీటికి తోడు హరిత పన్ను బాదుడు. వెరసి యజమానులు నలిగిపోతున్నారు. రవాణా వాహనాలపై ప్రస్తుతం 25 నుంచి 30 శాతం త్రైమాసిక పన్ను పెంచడంతో లారీలన్నీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన పార్వతీపురం మన్యం జిల్లాలో లారీ మోటారు పరిశ్రమ వేలాది మందికి జీవనోపాధి కల్పించేది ఇప్పుడు కుదేలైపోతోంది. 


వేల మందికి ఉపాధి


సాలూరు పట్టణంలో 2,000 లారీలున్నాయి. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో మరో వెయ్యి వరకు చిన్నాపెద్ద లారీలు ఉన్నాయి. వీటిపై ప్రత్యక్షంగా , పరోక్షంగా వేల మంది ఉపాధి పొందుతున్నారు. దీన్నే నమ్ముకొని బతుకుతున్నారు. కొన్నేళ్లుగా ఈ లారీపై పడుతున్న పన్నులు వారి ఉపాధిని దూరం చేస్తోంది. 


వాయిదాలు చెల్లించలేని దుస్థితి


రవాణా వాహనాలపై పన్నుల భారమే కాదు.. లారీల టైర్లు, విడిభాగాలు, ఇంధనం, బీమా ఇలా అన్నింటిపై కొన్నేళ్లుగా భారం పడుతోంది. బండి నడపడం కష్టంగా మారిందని ఓనర్లు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లలో ధరలన్నీ రెండింతలయ్యాయి. లీటరు డీజిల్‌ ధర రూ.50 ఉన్నప్పుడు టన్ను సరకు రవాణఆకు ఎంత కిరాయి వచ్చేదో ఇప్పుడు కూడా అంతే వస్తోందని చెబుతున్నారు. ఇప్పుడు డీజిల్ రేట్ మాత్రం రూ.100కు చేరింది. అదే టైంలో పన్ను రేట్లు కూడా పెరిగినట్టు చెబుతున్నారు. గతంలో లారీకి ఫైనాన్స్‌ వాయిదా చెల్లించగా నెలకు పది నుంచి రూ.15 వేలు మిగిలేదని ఇప్పుడు అప్పులే ఉంటున్నాయంటున్నారు. లోడింగ్‌, అన్‌లోడింగ్‌, పన్నుల భారంతో నెలనెలా వాయిదాలు చెల్లించలేని పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు.


నెలకు రెండువేలు కూాడా మిగలని దుస్థితి


ఇక్కడి లారీలన్నీ విశాఖ నుంచి రాయపూర్‌కు ముడి ఇనుము, ఇతర పరిశ్రమల సరకులు తరలిస్తాయి. ఒక లారీ నెలకు నాలుగు నుంచి అయిదు ట్రిప్పులు తిరుగుతుంది. గతంలో ఒక ట్రిప్పుకి ఇంధనం, ఇతర ఖర్చులు పోనూ రూ.5 వేల వరకు మిగిలేది. ప్రస్తుతం రూ.2 వేలు మిగలటం కష్టంగా మారింది. వ్యవసాయ అనుబంధ సరకుల రవాణా పెద్దగా లేదు. జిల్లాలోని అరటి పంటను ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలకు తరలించేవారు. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి నిత్యావసరాల రవాణా కూడా జరిగేది.


పన్ను భారం తగ్గించాలని డిమాండ్


ఇంధన ధరతోపాటు విడిభాగాలు, బీమా, పన్ను భారం పెరగడంతో లారీలు నడపలేని పరిస్థితి. వాహనం కొనుగోలుకు చేసిన నెలనెలా వాయిదాలుగా కూడా చెల్లించలేక.. వడ్డీలు కట్టలేక యజమానులు అమ్ముకుంటున్నారు. త్రైమాసిక, హరిత పన్నుభారం రూ.వందల నుంచి రూ.వేలల్లోకి చేరింది. ప్రభుత్వం పునరాలోచించి పన్ను భారం తగ్గించాలని వేడుకుంటున్నారు. లేదంటే లారీలు యార్డులకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని వాపోతున్నారు. 


Also Read: తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు - కదిరిలో ఘటన, ఫేక్ అని స్పష్టం చేసిన పోలీసులు


1960 నుంచి మొదలు...


1960లో ఆ ప్రాంతంలో ఉపాధి, వ్యాపార అవకాశాలు లేక వలసలు వెళ్లే వాళ్లు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి విజయనగరం, పార్వతీపురం రైల్వే స్టేషన్లకు వివిధ ముడి సరకులు వచ్చేవి. వీటిని నాటుబండ్లపై తరలించే గమ్యస్థానాలకు చేర్చేవారు. దీనికి చాలా ఎక్కువ సమయం పట్టేది. దాంతో లారీలను కొనడం ద్వారా వ్యాపారం చేయడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని కొందరు ఆలోచించారు. ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబాలు 12 లారీలను కొన్నారు. దీంతో స్థానికులకు డ్రైవర్లు, క్లీనర్లుగా ఉపాధి దొరికింది. అలా మొదలైంది సాలూరు లారీ పరిశ్రమ. 1963లో 30 మంది సాలూరు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌గా మారింది. 


లారీలు అమ్ముకుంటున్న ఓనర్లు


అలాంటి చరిత్ర ఉన్న పరిశ్రమకు నేడు రెడ్‌సిగ్నల్‌ పడుతోంది. లారీల నిర్వహణ కోసం అప్పులు చేసినా కిరాయి డబ్బులు రాక యజమానులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. పన్నుల భారం, నిర్వహణ వ్యయం పెరుగడంతో లారీలు అమ్మేస్తున్నారు. మరికొందరు అందుకు సిద్ధంగా ఉన్నారు. చేసిన అప్పులు తీర్చలేక, లారీలు నడపలేక మరికొందరు ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న సంక్షోభం నుంచి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు లారీ పరిశ్రమ యజమానులు, కార్మికులు.


Also Read: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య- కలకలం రేపుతున్న సూసైడ్‌లు