Srikakulam News: ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ వసతి గృహంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.  సివిల్‌ ఇంజినీరింగ్ మొదటి ఏడాది చదువుతున్న ఆర్.ప్రవీణ్ నాయక్ మూడో ఫ్లోర్ నుంచి బుధవారం అర్ధరాత్రి దూకేశాడు. వెంటనే అతన్ని క్యాంపస్ అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చారు. కానీ ఫలితం లేకుండాపోయింది. చికిత్స అందిస్తుండగానే ఐటీ విద్యార్థి ప్రవీణ్ నాయక్ మృతి చెందాడు. 


ప్రవీణ్ నాయక్ సొంత గ్రామం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కెవిజిడి బాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ, ఎస్పై సందీప్ కుమార్ స్పాట్‌కు చేరుకొని విచారణ జరిపారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో ఏడాదికో విషాదం వెంటాడుతునే ఉంది. పీయూసీ, ఇంజనీరింగ్‌లో సుమారు 4,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. 


2022 సెప్టెంబర్ 7న ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అదే ఏడాది నవంబర్లో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల పాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. క్యాంపస్‌లోనే ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అంతా సవ్యంగా సాగుతుందన్న తరుణంలో సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. 


రెండేళ్ల క్రితం పీయూసీ రెండోఏడాది చదువుతున్న విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన విద్యార్థిని బవిరి వశిష్ట రోహిణి(17) ఇలానే ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో వసతి గృహంలో ఫ్యానుకు ఉరి వేసుకుంది.  ఆ రోజు నిర్వహించిన పరీక్షలు సక్రమంగా రాయనందున మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు చెప్పుకొచ్చారు. 


సరిగ్గా రెండేళ్ల తర్వాత మరోమారు ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతిపట్ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతాపం తెలుపారు. ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తక్షణమే తెలపాలని అధికారులకు, పోలీసులకు ఆదేశించారు. భవనం మీద నుంచి దూకి విద్యార్థి చనిపోయాడని తెలుసుకున్న ఎమ్మెల్యే ఎన్ఐర్ క్యాంపస్‌ను తనిఖీ చేశారు. ఏం జరిగిందన్న విషయం మీద ఆరా తీశారు. 


Also Read: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ


ఎమ్మెల్యేతోపాటు డీఎస్పీ వివేకానంద, తహసీల్దార్లు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారం రోజులు క్రితం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలో పదోతరగతి విద్యార్థి మృతి చెందారు. అది మరవకముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై ఆందోళనకలిగిస్తోంది. ఎచ్చెర్ల మండలంలో ఇలాంటి ఘటనలు జరగడంపై హాస్టల్లో ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటి అని పోలీసులు ప్రత్యేక దృష్టి సాధించారు. ఇలా ఎందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన ే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండు ఘటనలు చూసిన పేరెంట్స్‌ తమ పిల్లల్ని హాస్టల్స్‌లో ఉంచేందుకు ఇష్టపడటం లేదు. ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. 


విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది, యాజమాన్యం ఇబ్బందులకే విద్యార్థులు చనిపోతున్నారని ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని అంటున్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు లేకపోవడంతోనే ఇవి పునారవృతమవుతున్నాయని మండిపడుతున్నారు. విద్యార్థులకు మార్గదర్శకం, ఉపాధ్యాయులు సరైన శిక్షణ లేకే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. కొంతమంది ఇంటి సమస్యలతో ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. ఏమైనా సరే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని వారిలో ధైర్యాన్ని నింపే పనులు చేపట్టాలన్నారు. 


Also Read: తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు - కదిరిలో ఘటన, ఫేక్ అని స్పష్టం చేసిన పోలీసులు