ప్రతీరోజూ ఎంతోమంది సందర్శకులను అలరించే విశాఖ విశాఖ జూకి కొత్త సమస్య వచ్చిపడింది. రకరకాల జంతువులే ప్రధాన ఆకర్షణగా చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకునే జూలో ఒక జాతి జీవి మాత్రం అధికారులకు చికాకు పెడుతోంది. అదే మఘర్ అనే పేరుగల ఒకరకం మొసలి. ఈ మధ్య ఈ రకం మొసళ్ల సంఖ్య పెరిగిపోవడంతో ఏం చెయ్యాలా అంటూ సమాలోచనల్లో మునిగిపోయారు జూ  అధికారులు. 


గతేడాది బ్రీడింగ్‌తో మొదలైన సమస్య


ఒకప్పుడు విశాఖ జూలో మొసళ్ల బ్రీడింగ్ జరిగేది. అయితే గత కొన్నేళ్లుగా అలాంటి ప్రక్రియ జరగలేదు. కానీ గతేడాది మాత్రం కర్ణాటక నుంచి తీసుకొచ్చిన మొసళ్ల జంట వల్ల మళ్ళీ బ్రీడింగ్ జరిగింది. దీంతో వాటి సంఖ్య 17కు చేరింది. సాధారణంగా భారీగా పిల్లలు పుట్టినావాటిలో బతికే వాటి సంఖ్య చాలా తక్కువ. పక్షులు లాంటివి ఎత్తుకుపోవడం, సరైన తిండి దొరక‌్క పెద్దవి అయ్యేలోపు చాలా మొసలి పిల్లలు చనిపోతాయి. అయితే విచిత్రంగా విశాఖ జూలో ఈసారి పుట్టిన పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉండడంతోపాటు సురక్షితంగా ఉన్నాయి. మొసలి పిల్లలు పెరుగుతున్న కొద్ది అధికారులు వాటి భవిష్యత్తు ప్రణాళికలకు రెడీ చేస్తున్నారు.

 తిండి కోసం, బ్రీడింగ్ కోసం మొసళ్ళ మధ్య పోటీ


మొసళ్ళు సాధారణంగా జూలో ఎక్కువ సంఖ్యలో ఉండవు. మరీ పెద్ద జూ అయితే తప్ప వాటి పోషణ అంత  సులభంకాదు. వాటి మధ్య జరిగే పోట్లాట కారణంగా తీవ్రంగా గాయపడడమో, చనిపోవడమో జరుగుతూ ఉంటాయి. అందుకే మొసళ్ల సంఖ్య పెరుగుతూ ఉంటే జూ అధికారులు వెంటనే వాటి ఎన్క్లోజర్ల విస్తీర్ణం పెంచడమో లేక వాటిలో కొన్నింటిని వేరే జూలకు ఎక్స్చేంజ్ చేసి ఆయా జూలలో లేని జంతువులను తెచ్చుకుంటాయి. అయితే విశాఖ జూకి మాత్రం ఆ ప్రక్రియ అంత సులభం కాదనిపిస్తుంది . 
 

కోవిడ్ కారణంగా యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌కి బ్రేక్


ప్రస్తుతం పిల్లలతో సహా ఉన్న మఘర్ మొసళ్ళతోపాటు, సన్నని ముక్కుతో గంగానదిలో ఎక్కువగా కనిపించే ఘరియల్ రకం మొసళ్లు, భీకరంగా కనిపించే ఉప్పునీటి మొసలి విశాఖలోని ఇందిరా గాంధీ జూలో ఉన్నాయి. ఇందులో స్వభావ రీత్యా వేరేవాటితో కలవని ఉప్పునీటి మొసలి, ఘరియల్ మొసళ్లను వేరేవేరే ఎన్క్లోజర్లలో ఉంచారు. కానీ పిల్లలతో ఉన్న మఘర్ మొసళ్ళు మాత్రం అన్నీ కలిసి ఒకే ఎన్క్లోజర్‌లో ఉంచారు. పుట్టినప్పుడు బానే ఉన్నా ప్రస్తుతం కాస్త పెరిగిన మొసలి పిల్లలతో కలిసి మరో మూడు పెద్ద మఘర్ మొసళ్ళు ఒకే చోట ఉండడం సరికాదని భావించిన అధికారులు వాటి వాటిని వేరే జూలకు ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ద్వారా పంపించి.. మరోజాతి జంతువులను విశాఖకు రప్పించాలని చూశారు. కోవిడ్ బ్రేక్ వేయడంతో ఆ యానిమల్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్ తాత్కాలికంగా ఆగిపోయింది. అప్పటి నుంచి మొసలి పిల్లలు ,పెద్ద మొసళ్ళు ఒకే చోట ఉండిపోయాయి. వాటి పోషణకూ ఖర్చు అధికంగానే అవుతుండడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించారు. 

దత్తతకు మొసళ్ళు 


ప్రజలకు జంతుజాలం పట్ల ప్రేమ, ప్రకృతితో మమేకం అయ్యే అవకాశం ఇవ్వడం కోసం ప్రవేశ పెట్టిందే యానిమల్ అడాప్షన్. ఈ ప్రక్రియ ద్వారా మొసళ్లను కూడా దత్తతకు ఇస్తున్నారు. నెలకు లేదా ఏడాదికి ఇంత అని డబ్బులు కట్టడంద్వారా మొసళ్లను దత్తత తీసుకుని వాటిని సాకావచ్చు అంటున్నారు జూ సిబ్బంది. ఒక్కో మొసలిని వారం, నెల, ఆరు నెలలు, సంవత్సరంపాటు దత్తత తీసుకోవచ్చు. ఒక్కో మొసలికి వారానికి రూ.525, నెలకు రూ.2,000, ఆరు నెలలకు రూ.12,000, ఏడాదికి రూ.24,000 ఆహారం కోసం ఇచ్చి దత్తత తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు . 
 

యానిమల్ ఎక్స్చేంజ్ కోసం ప్రయత్నాలు 



దత్తత అనేది కేవలం వాటి పోషణ కోసం మాత్రమే. కానీ అన్ని మొసళ్ళు ఒకేచోట ఉండడం ప్రమాదం కాబట్టి వాటిలో కొన్నింటిని వీలైనంత త్వరగా ఇతర జూలకు ఎక్స్చేంజ్ చేసి వేరే రకాల జీవులను తేవడానికి జూ అధికారులు సన్నాహాలు మొదలెట్టారు. కోవిడ్ ప్రభావం తగ్గడంతో వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం దిల్లీ, చెన్నై, మిజోరాంలోని ఐజ్వాల్, చండీఘడ్, లక్నో, తిరుపతి లాంటి చోట్ల గల జూలతో యానిమల్ ఎక్స్చేంజ్ కోసం సంప్రదింపులు చేస్తునట్టు విశాఖ జూ  క్యూరేటర్ డా. నందని సలారియా తెలిపారు. ఇక్కడ అధికసంఖ్యలో ఉన్న మఘర్ మొసళ్లను ఆయా జూలకు పంపించి అక్కడ నుంచి వేరే జంతువులను విశాఖకు రప్పించాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రస్తుతం విశాఖ జూలో ఉన్న ఉప్పునీటి మొసలి, ఘరియల్ మొసళ్ళు కేవలం ఆడవి కావడంతో వాటి కోసం వేరే జూల నుంచి మగ మొసళ్లను రప్పించాలని కూడా అధికారులు  చూస్తున్నారు. మరి వారి ప్రయత్నాలు ఫలించి వారి మొసలి కష్ఠాలు ఎప్పటికి తీరతాయో చూడాలి.