Modi In Andhra Pradesh: అశేష జనవాహని మధ్య సాగరతీరంలో ప్రధానమంత్రి మోదీ రోడ్‌షో సాగింది. ఈ రోడ్‌షోలో ప్రధానితోపాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. విశాఖలోని సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్రాయూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు సాగిందీ యాత్ర. దారి పొడవున భారీగా తరలి వచ్చిన జనం ముగ్గురు నేతలపై పూలుజల్లి ఘన స్వాగతం పలికారు. 






విశాఖ నగరం మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నినాదాలతో దద్దరిల్లింది. ఎన్నికల తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన మోదీకి కూటమి ప్రభుత్వం ఘన స్వాగం పలికింది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యకే కమిటీ వేసి జనాన్ని సమీకరించారు. పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్డు షో జరిగే ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచే ఆంక్షలు విధించారు. భారీగా ట్రాఫిక్‌ను మళ్లించారు. 


రోడ్‌షో కంటే ముందు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధానమంత్రికి విశాఖలో గవర్నర్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఐఎన్‌ఎస్ డేగాకు ముందే చేరుకున్న ముగ్గురు నేతలు మోదీని ఆహ్వానించారు. 






అక్కడి నుంచే నేరుగా సిరిపురం చేరుకున్న ప్రధానమంత్రి అక్కడ నుంచి రోడ్‌షోలో పాల్గొన్నారు. దాదాపు గంటపాటు సాగిందీ రోడ్‌షో. తర్వాత ఆంధ్రాయూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడే రూ.2 లక్షల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్‌లకు కూడా భూమి పూజ చేశారు. 




 



వర్చువల్‌గా విశాఖ రైల్వే జోన్‌ ప్రధాన కేంద్రం, పూడిమడకలో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్, నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్కు, కృష్ణపట్నం ఇండ్రస్టియల్‌ నోడ్, గుంటూరు–బీబీనగర్, గుత్తి–పెండేకల్‌ రైల్వే లైన్ల డబ్లింగ్‌ పనులకు భూమిపూజ చేస్తారు. అదే వేదికపై చిలకలూరిపేట 6 లైన్ల బైపాస్‌ రోడ్డును జాతికి అంకితం చేస్తారు.  విశాఖ పర్యటన ముగించుకున్న తర్వాత మోదీ భువనేశ్వర్‌ వెళ్లనున్నారు.