Police Attack On Army Jawan: అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిశా యాప్ ఓటీపీ చెప్పలేదని ఆర్మీ జవాన్‌పై నలుగురు పోలీసులు దాడి చేశారు. వివరాలు... పరవాడ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన నలుగురు పోలీసులు మంగళవారం స్థానిక మార్కెట్‌లో దిశ యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు సంతకు వచ్చే వినియోగదారులను దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు.


ఎలమంచిలి మండలం రేగుపాలేనికి చెందిన సయ్యద్‌ అలీముల్లా జమ్మూకశ్మీర్‌ బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైఫిల్‌ క్యాంపులో సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 2న సెలవుపై ఇంటికి వచ్చారు. ఆయన మంగళవారం పరవాడ సంత బయలు వద్ద బస్సు కోసం ఎదరు చూస్తున్నారు. ఆ సమయంలో కానిస్టేబుళ్లు ముత్యాలనాయుడు, శోభారాణి అక్కడ ఉన్న వారితో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే సయ్యద్‌ అలీముల్లా ఫోన్‌లోనూ యాప్ డౌన్‌లోడ్‌ చేయించారు. ఈ క్రమంలో వచ్చిన ఓటీపీని ఓ కానిస్టేబుల్‌ రాసుకున్నారు. 


అభ్యంతరం చెప్పిన జవాన్
పోలీసులు ఓటీపీ రాసుకోవడంపై ఆర్మీ ఉద్యోగి సయ్యద్‌ అలీముల్లా అభ్యంతరం తెలిపారు. ఓటీపీతో సైబర్‌ మోసాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అలాగే కానిస్టేబుళ్ల బ్యాడ్జిలపై పేర్లు లేవని.. తనకు అనుమానంగా ఉందని చెప్పారు. ఐడీ కార్డులు చూపించాలని కానిస్టేబుళ్లను అడిగారు. దీంతో సదరు పోలీసులకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మమ్మల్నే ఐడీ కార్డు అడుగుతావా? ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌ మండిపడింది. పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్‌తో కలిసి అలీముల్లాపై దౌర్జన్యం చేశారు. తాను ఒక ఆర్మీ ఉద్యోగినని చెప్పినా వినిపించుకోకుండా దాడి చేశారు.


ఐడీ కార్డు లాక్కెళ్లిన పోలీసులు
అంతలోనే మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకున్నారు. అలీముల్లాను కాలర్ పట్టుకుని లాగారు. పోలీస్‌ స్టేషన్‌కు తరలించడానికి బలవంతంగా ఆటో ఎక్కించే ప్రయత్నం చేశారు.  అయితే ఆయన ప్రతిఘటించారు. తోపులాటలో ఆయన కింద పడిపోయారు. ఆయన చొక్కా చిరిగిపోయింది. చివరకు ఆర్మీ ఉద్యోగి ఐడీ కార్డును తీసుకుని వదిలేశారు. తనపై పోలీసులు దాడి చేయడంపై అలీముల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కానిస్టేబుల్‌ బూటుకాలితో తన్నారని, మహిళా కానిస్టేబుల్‌ తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐడీ కార్డు అడిగినంత మాత్రాన దాడి చేస్తారా అని పోలీసులను ప్రశ్నించారు. పురుషులకు దిశ యాప్‌ ఎందుకని నిలదీశారు.


నలుగురిపై చర్యలు
ఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని పరవాడ సీఐ ఈశ్వరరావు తెలిపారు. ఆర్మీ ఉద్యోగి, పోలీసుల మధ్య జరిగిన సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ స్పందించారు. వెంటనే నలుగురు కానిస్టేబుళ్లను ఏఆర్‌కు అటాచ్ చేస్తూ విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏ తప్పు చేయని సైనికుడి విషయంలో పోలీసులు వ్యవరించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐడీ కార్డు అడిగితే దాడి చేస్తారా అంటూ నిలదీస్తున్నారు.