PM Narendra Modi Speech At AU College in Vizag: ఏపీ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని, ప్రపంచ వ్యాప్తంగా ఏపీ ప్రజలు ప్రతిభ చూపి సత్తా చాటుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. ఈరోజు ప్రారంభించిన ప్రాజెక్టులు అందరికీ దోహదం చేస్తాయన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇటీవల ఏపీకి వచ్చానని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.


విశాఖ నుంచి రోమ్ వరకు వర్తకం.. 
భారత దేశంలో విశాఖ ప్రత్యేకమైన నగరం అన్నారు. ఈరోజు ఏపీకి, విశాఖకు గొప్పదినం అన్నారు ప్రధాని మోదీ. విశాఖ ఓడరేవు చారిత్రాత్మకమైనదని, ఇక్కడి నుంచి రోమ్ వరకు వర్తకం జరిగేదని.. ఇప్పటికీ విశాఖ నగరం వ్యాపారం కేంద్రంగా కొనసాగుతోందన్నారు. రూ.10 వేల కోట్ల ప్రాజెక్టులతో విశాఖ ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన కీలక నేతలు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హరిబాబులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. వాళ్లు ఎప్పుడు కలిసినా ఏపీ ప్రజల సంక్షేమం, డెవలప్‌మెంట్ గురించి చర్చించేవాళ్లమని చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో తమ విజన్ ఏంటన్నది, నేడు ప్రారంభించిన ప్రాజెక్టులు తెలియజేస్తాయన్నారు ప్రధాని మోదీ. 






టెక్నాలజీ మాత్రమే కాదు స్నేహ శీలత ముఖ్యమే..
ఏపీ ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటడానికి కేవలం వారి తెలివితేటలు, టెక్నాలజీ మాత్రమే కారణం కాదని, వారి స్నేహ శీలత, మంచితనం కూడా ఓ కారణం అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఓవైపు విశాఖ రైల్వే స్టేషన్‌ను డెవలప్ చేస్తూనే మరోవైపు ఫిషింగ్ హార్బన్ ను ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. మౌలిక వసతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వెనకడుకు వేయదని చెప్పేందుకు నేడు ప్రారంభించిన రూ.10 వేల కోట్ల ప్రాజెక్టులు అందుకు నిదర్శనం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు మరింత కీలకం కానున్నాయని చెప్పారు.


రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాం..
అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు ప్రతి రంగంలోనూ మనం ప్రగతి సాధిస్తున్నామని చెప్పారు. అన్నదాతలకు ప్రతి ఏడాది మూడు విడతలుగా రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఓ వైపు తాము చేసిన అభివృద్ధి కారణంగా మరోవైపు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పేద ప్రజల కోసం సైతం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా నిలుస్తుందన్నారు.