Pawan Kalyan Meeting With The Leaders Of Visakhapatnam Today : జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఆదివారం విశాఖపట్నం రానున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక విమానంలో వచ్చి నోవాటెల్‌లో బస చేయనున్నారు. నోవాటెల్‌లోనే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం కానున్నారు. ఒకేసారి అందరితో సమావేశం కాకుండా.. విడివిడిగా మాట్లాడనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో పొత్తులో భాగంగా తీసుకోవాలనుకునే సీట్లు, ఇతర అంశాలపై నాయకులతో చర్చించనున్నారు. విశాఖ జిల్లాలోని అనేక నియోజకవర్గాలు నుంచి పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర పార్టీలు నుంచి వచ్చి చాలా మంది నాయకులు పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయా నేతలకు సీట్ల సర్ధుబాట్లు, పార్టీ పటిష్టానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పవన్ కల్యాణ్ చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఉమ్మడి విశాఖలో 15 అసెంబ్లీ స్థానాలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటిలో సుమారు పది స్థానాలకు జనసేన నుంచి సీట్లు కోరుతున్న అభ్యర్థులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో పార్టీలో చేరిన సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ వంటి వారు ఉన్నారు. వీరితోపాటు గతంలో నుంచి పార్టీ కోసం పని చేస్తున్న శివ శంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, కోన తాతారావు, సుందరపు విజయ్ కుమార్, పుసుపులేటి ఉషాకిరణ్ వంటి చాలా మంది నేతలు ఉన్నారు. వీరికి ఎక్కడ అవకాశాలు కల్పించాలి, ఏయే సీట్లను పొత్తులో భాగంగా తీసుకుంటే గెలిచే అవకాశాలు ఉన్నాయి వంటి అంశాలపై పవన్ ముఖ్య నేతలతో చర్చించనునన్నట్టు చెబుతున్నారు. సామాజికవర్గాలు వారీగా ఉన్న బలం, సీనియారిటీ, మహిళలకు ప్రాధాన్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సీట్ల కేటాయింపు ఉండే అవకాశముంది. వీరితోపాటు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న నాయకులు పవన్‌తో సమావేశానికి రావాల్సిందిగా సమాచారాన్ని పార్టీ నాయకత్వం అందించింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులకు ఎన్నికల్లో పోటీపై స్పష్టత వచ్చే అవకాశముంది.
పొత్తులో పోటీ చేసే స్థానాలపై స్పష్టత
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా పర్యటన ఆ పార్టీకి కీలకమైనదిగా చెబుతున్నారు. రెండు రోజుల్లో పొత్తులకు సంబంధించి తుది చర్చలు జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లను అడిగే జిల్లాగా ఉమ్మడి విశాఖ ఉంది. కాబట్టి, ఇక్కడ పార్టీ బలం, ఏయే స్థానాలు తీసుకుంటే విజయావకాశాలు ఉంటాయన్న విషయాలపై పార్టీ నాయకులతో చర్చించేందుకు పవన్ కల్యాణ్ వస్తున్నారు. సీనియర్ నేతల సలహాలు, సూచనలు తీసుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలాన్ని బట్టి సీట్లను కోరడానికి పవన్ కల్యాణ్ సన్నద్ధం కానున్నారు.
ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా విశాఖ పర్యటనకు పవన్ వస్తున్నట్టు పార్టీ వర్గాలు సమాచారం. పార్టీ నాయకులు సూచించే స్థానాలను పరిశీలించడంతోపాటు అక్కడ తనకు ఉన్న సమాచారం, సర్వే ఫలితాలను భేరీజు వేసుకుని సీట్లను పవన్ అడగనున్నారు. ఉమ్మడి విశాఖలోని కనీసం ఆరు స్థానాలను జనసేన కోరే అవకాశముందని చెబుతున్నారు. ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అవసరమైన బలమైన అభ్యర్థులను కూడా జనసేన సిద్ధం చేసింది. మరి పవన్ కల్యాణ్ తాజా సమావేశంలో పార్టీ నాయకులకు ఏం దిశా, నిర్ధేశం చేస్తారో.