Janasena News: విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు కాలిపోయిన బాధితులకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం చేశారు. వారికి చెక్కులను పంపిణీ చేశారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున 49 మంది మత్స్యకారులకు పవన్ కల్యాణ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాను ప్రస్తుతం చేస్తున్న సాయం ఇప్పటికిప్పుడు బాధితుల కష్టాలు తీరుస్తుందని తాను నమ్మడం లేదని అన్నారు. తమకు కష్టాలు వచ్చిన సందర్భంలో పవన్ కల్యాణ్ ఉన్నాడనే ధైర్యాన్ని ఇస్తుందని చెప్పారు.


తాను ఏనాడూ మత్స్యకారులను ఓటు బ్యాంక్‌ అని ఆలోచించలేదని అన్నారు. కష్టాల్లో ఉన్న తాను మద్దతుగా ఉంటానని చెప్పడం కోసం తాను వచ్చి సాయం చేస్తున్నానని చెప్పారు. సుమారుగా 25 కోట్ల మేర నష్టం జరిగిందని చెబుతున్నారని అన్నారు. ప్రతి మత్స్యకారుడికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు.


‘‘వైసీపీ వచ్చాక రౌడీలు రాజ్యాలు ఏలుతున్నారు. మత్స్యకారులకు ఒక్కటే చెప్తున్నాను... మొన్న వైసీపీ ప్రభుత్వానికి 6 నెలలే సమయం ఉంది అని చెప్పాను, దాంట్లో 2 నెలలు అయిపోయాయి, ఇంక మిగిలింది 4 నెలలు మాత్రమే, ఈ నాలుగు నెలలు భరించండి, మన ప్రభుత్వం వచ్చాక రౌడిమూకలు లేని, భద్రత తో కూడిన హార్బర్ ఉండేలా చేస్తాం’’ అని విశాఖ మత్స్యకారులకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.






‘‘నేను ఎప్పుడు విశాఖ వద్దామని అనుకున్నా సరే ఆంధ్రాలో అడుగుపెడదామంటే ఏవో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆంధ్రా ఇంటెలిజెంట్ చీఫ్ ఇక్కడికి వస్తున్న ఫ్లైట్ ని బెదిరించి పంపించారు. ఇక్కడ గంగపుత్రుల కోసం రూ.400 కోట్లు పెడితే జెట్టి పూర్తవుతుంది. కానీ ఆ డబ్బు మొత్తాన్ని రూ.451 కోట్లు రుషికొండ మీద పెట్టారు.


జగన్ విలాసాలకు కాకుండా, జెట్టికి పెడితే 10 వేల కుటుంబాలు చాలా బాగా జీవించేవి. ప్రజలకు మంచి పాలన అమరావతి నుంచి కూడా చేయవచ్చు. మత్స్యకారుల భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేస్తా. ఇంతకాలం అందరినీ నమ్మారు. ఒక దశాబ్దం పాటు మమ్మల్ని నమ్మండి తప్పు జరగనివ్వను. సంపద వెనకబడిన కులాలకు రావాలి. జనసేన సోషలిజం నమ్మే పార్టీ. జనసేన, టీడీపీ ప్రభుత్వం రాబోతుంది’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.