Nara Lokesh Comments in Shankharavam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం సభ నేడు (ఫిబ్రవరి 13) పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేశ్ (Nara Lokesh) అధికార పార్టీ విధానాలను, స్థానిక నేతల అక్రమాలపై విమర్శించారు. అందులో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి (Pushpa Sreevani)ని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ప్రస్తుతం ఆమె టిక్ టాక్ ఆంటీ‌గా బిజీ అయ్యారని ఎద్దేవా చేశారు. పుష్పశ్రీవాణితో పాటు ఆమె భర్త పరీక్షిత్ రాజు, ఆయన తోడల్లుడు రమేష్ బాబు కలిసి కురుపాం నియోజకవర్గాన్ని మూడు ముక్కలుగా చేసి దోచుకుంటున్నారని లోకేశ్ ఆరోపణలు చేశారు.


సీఎం జగన్ పాలన గురించి మాట్లాడుతూ జగన్ పాలనలో ఆయన మీడియా సంస్థ కోసం అచ్చు వేయించుకున్న క్యాలెండర్ తప్ప.. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్లే లేవని సెటైర్లు వేశారు. జగన్ అంటే జైలు అని.. చంద్రబాబు అంటే బ్రాండ్ అని వ్యాఖ్యానించారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ సునీత వంటి ఆడపడుచులకే వారి ఇంట్లో రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జగన్ ఇంటివారే రక్షణ కావాలని కోరితే సామాన్య మహిళల పరిస్థితి ఏపీలో ఎలా ఉందో అర్థం అవుతోందని అన్నారు.


జగన్ జైలుకెళ్తే ఎన్నో కుంభకోణాలు బయటికి - లోకేశ్
సీఎం జగన్ విశాఖపట్నంలో కట్టుకున్న ప్యాలెస్‌ను తాము అధికారంలోకి రాగానే ప్రజలకు అవసరం కలిగే భవనంలాగా మారుస్తామని నారా లోకేశ్ చెప్పారు. విశాఖ ఉక్కు ప్లాంటుపై జగన్ ధోరణిని లోకేశ్ విమర్శించారు. అవసరమైతే విశాఖ ఉక్కు ప్లాంటును తామే కొనుగోలు చేస్తామని వివరించారు. ‘‘జగన్ జైలుకెళ్తే రోజుకొక కుంభకోణం బయటపడింది. అదే చంద్రబాబు జైలుకు వెళ్తే ఆయన చేసిన మంచి పనులు బయటికి వచ్చాయి. జగన్ ను చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తుకు వస్తాడు. వైఎస్ఆర్ సీపీకి అంతిమయాత్ర మొదలైంది. షర్మిల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తుంటే పేటీఎం కుక్కలు ఆమెపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. పేటీఎం కుక్కల పేర్లు కూడా నా రెడ్ బుక్ లో ఉన్నాయి. ఎన్నికల తర్వాత జగన్ పక్క రాష్ట్రానికి పారిపోతాడు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. 


జగన్ పథకాల పేరుతో బులుగు బటన్ నొక్కగానే అకౌంట్ లో డబ్బులు పడుతుంటాయి. బల్ల కింద రెడ్ బటన్ నొక్కగానే ఇచ్చినవన్నీ లాగేసుకుంటాడు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. అన్ని ధరలు పెంచాడు. జగన్ కటింగ్ మాస్టర్ లా పేరు తెచ్చుకున్నాడు. అన్న క్యాంటిన్లు కట్, పెన్షన్లు కట్, నిరుద్యోగ భ్రుతి కట్, పండుగ కానుకలు కట్, విదేశీ విద్య, రైతులకు రావాల్సిన గిట్టుబాటు ధరలు కట్ లాంటి పదుల సంఖ్యలో పథకాలను కట్ చేశాడు. ఇంకో రెండు నెలలు మాత్రమే ఓపిక పట్టండి.. జగన్ కట్ చేసిన పథకాలన్నీ మేం మళ్లీ పునరుద్ధరిస్తాం’’ అని లోకేశ్ మాట్లాడారు.