ABP  WhatsApp

Nara Lokesh: నా రెడ్ బుక్‌లో పేటీఎం కుక్కల పేర్లు కూడా, మీ సంగతేంటో ఊహించుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు

ABP Desam Updated at: 13 Feb 2024 03:53 PM (IST)

Nara Lokesh Comments: పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండలో నారా లోకేశ్ శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీ అధినేత, సీఎం జగన్ పైన విమర్శలు చేశారు.

లోకేశ్

NEXT PREV

Nara Lokesh Comments in Shankharavam in Palakonda: తెలుగు దేశం పార్టీ - జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఆలస్యం అయిన క్రమంలో నిరుద్యోగ భ్రుతి కూడా ఇస్తామని చెప్పారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ముగ్గురు పిల్లలు ఉన్నా రూ.45 వేల రూపాయలు ఇస్తామని వివరించారు. రైతుల కోసం వారి ఆత్మహత్యలు తగ్గించడానికి రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని వివరించారు. ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మహిళలకు ఇస్తామని వివరించారు. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామని వివరించారు. ఐదేళ్లలో రూ.90 వేలు వారికి వస్తాయని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండలో నారా లోకేశ్ శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీ అధినేత, సీఎం  జగన్ పైన విమర్శలు చేశారు.


సీఎం జగన్ విశాఖపట్నంలో కట్టుకున్న ప్యాలెస్‌ను తాము అధికారంలోకి రాగానే ప్రజలకు అవసరం కలిగే భవనంలాగా మారుస్తామని నారా లోకేశ్ చెప్పారు. విశాఖ ఉక్కు ప్లాంటుపై జగన్ ధోరణిని లోకేశ్ విమర్శించారు. అవసరమైతే విశాఖ ఉక్కు ప్లాంటును తామే కొనుగోలు చేస్తామని వివరించారు. ‘‘జగన్ జైలుకెళ్తే రోజుకొక కుంభకోణం బయటపడింది. అదే చంద్రబాబు జైలుకు వెళ్తే ఆయన చేసిన మంచి పనులు బయటికి వచ్చాయి. జగన్ ను చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తుకు వస్తాడు. వైఎస్ఆర్ సీపీకి అంతిమయాత్ర మొదలైంది. షర్మిల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తుంటే పేటీఎం కుక్కలు ఆమెపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. పేటీఎం కుక్కల పేర్లు కూడా నా రెడ్ బుక్ లో ఉన్నాయి. ఎన్నికల తర్వాత జగన్ పక్క రాష్ట్రానికి పారిపోతాడు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. 


జగన్ పథకాల పేరుతో బులుగు బటన్ నొక్కగానే అకౌంట్ లో డబ్బులు పడుతుంటాయి. బల్ల కింద రెడ్ బటన్ నొక్కగానే ఇచ్చినవన్నీ లాగేసుకుంటాడు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. అన్ని ధరలు పెంచాడు. జగన్ కటింగ్ మాస్టర్ లా పేరు తెచ్చుకున్నాడు. అన్న క్యాంటిన్లు కట్, పెన్షన్లు కట్, నిరుద్యోగ భ్రుతి కట్, పండుగ కానుకలు కట్, విదేశీ విద్య, రైతులకు రావాల్సిన గిట్టుబాటు ధరలు కట్ లాంటి పదుల సంఖ్యలో పథకాలను కట్ చేశాడు. ఇంకో రెండు నెలలు మాత్రమే ఓపిక పట్టండి.. జగన్ కట్ చేసిన పథకాలన్నీ మేం మళ్లీ పునరుద్ధరిస్తాం’’ అని లోకేశ్ మాట్లాడారు.



మనం ఎప్పుడూ తన్నే దున్నపోతు జోలికి వెళ్లం. ఎందుకంటే దగ్గరికి వెళ్తే అది తంతుంది కాబట్టి. కాని పాలిచ్చే ఆవు దగ్గరికి మాత్రం వెళ్తాం. ఇంకా కొంచెం ఎక్కువ పాలివ్వమని అడుగుతాం. ఇక్కడ తన్నే దున్నపోతు వైసీపీ ప్రభుత్వం.. పాలిచ్చే ఆవు తెలుగు దేశం పార్టీ.-

Published at: 13 Feb 2024 03:53 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.