విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. ముగ్గురు డీసీపీలతో 15 బృందాలుగా గాలించడంతో ఎనిమిది గంటలలో పోలీసులు కేసును చేధించారు. ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు చందుతో పాటు వాళ్ల ఫ్యామిలీకి సన్నిహితుడు, ఆడిటర్‌, వైఎస్ఆర్ సీపీ నేత అయిన గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. 


పోలీసులు చేజింగ్ చేసే సమయంలో పోలీసు కారు ఢీకొట్టడం వల్ల వారికి కొద్దిపాటి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీవీతోపాటు ఎంపీ కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ రోజు (జూన్ 15) ఉదయం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ జీవీకి ఫోన్ చేయడంతో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పోలీసులు ఆయన ఫోన్ ట్రాక్ చేయయంతో పద్మనాభం వైపు వెళుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు ఆ వైపుగా ఛేజింగ్ చేసి ఎంపీ కుటుంబ సభ్యులను సురక్షితంగా విశాఖపట్నానికి తరలించారు.


అయితే, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ కేవలం డబ్బు కోసమే ఈ వ్యవహారం నడిచిందని తనకు ఎవరూ శత్రువులు లేరని తెలిపారు. ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులు షాక్ లో ఉన్నారని తెలిపారు.


అయితే, నలుగురు దుండగులు కలిసి ఈ కిడ్నాప్‌ చేసినట్లు తెలిసింది. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడిని హేమంత్‍గా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. రౌడీ షీటర్ హేమంత్ పై 2 కిడ్నాప్, ఓ మర్డర్ కేసు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హేమంత్ ఈ కిడ్నాప్ ద్వారా రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.


ఎంపీ పోలీసులకు ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. పోలీసులు దర్యాప్తు చేసినట్లు తెలిసింది. అందువల్లే త్వరగానే ఈ కేసును పోలీసులు ఛేదించారని తెలుస్తోంది. హేమంత్‌ తరచూ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో గొడవలు పడుతూ ఉంటాడు. ఈ సంవత్సరం కూడా అతనిపై ఇలాంటి కేసులు ఉన్నాయి. అందువల్ల ఈ కిడ్నాప్ ఘటన జరగగానే.. ఇందులో హేమంత్ పాత్ర ఉండొచ్చనే అనుమానాలు కలిగినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే ఈ కేసును త్వరగా ఛేదించారని సమాచారం. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు కాబట్టి, ఈ కథ సుఖాంతం అయిందనే అనుకోవచ్చు. దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన చెయ్యాల్సి ఉంది.