AP Latest News: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఆరిలోవ అటవీ ప్రాంతంలోని ఆర్ అండ్ బీ రోడ్డును నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికలకు ముందు హడావిడి చేసి పనులు మొదలు పెట్టి, తరువాత ఎందుకు నిలిపివేసారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వర్టులు కట్టకుండా తారు రోడ్డు వేయడం ఏంటని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని బెర్మో వేసే సమయంలో 10 టన్నుల బరువు గల రోలర్ తో తొక్కించకుండా కేవలం 3 టన్నుల కెపాసిటీ కలిగిన రోలర్ తో రోడ్డు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్వర్టు, బ్రిడ్జిలు కట్టకుండా అర్ధరాత్రి సమయంలో తారు రోడ్డు వేయడమేంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. క్వాలిటీ కంట్రోల్ కి రిపోర్టు ఇవ్వకపోవడంపై అధికారులపై సీరియస్ అయ్యారు. కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని, ఈ రోడ్డుకు బిల్లు మంజూరు చేస్తే ఊరుకునేది లేదని ఆయన అధికారులకు హుకుం జారీ చేశారు. తప్పు చేసిన అధికారులు శిక్ష అనుభవించవలసిందే అని అన్నారు. నర్సీపట్నం అబిడ్ సెంటర్ ప్రధాన రహదారి వెడల్పు పనులపై కూడా ఆయన పరిశీలన చేశారు. ఈ సమయంలో ఆర్ అండ్ బీ, మునిసిపల్ అధికారులను పరుగులు పెట్టించారు.
ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పలు కీలక ప్రశ్నలు సంధించారు. ఆర్ అండ్ బి పరిధిలో ఉన్న రోడ్లను మునిసిపల్ అధికారులు ఏ విధంగా వేస్తారు. గత ప్రభుత్వంలో రూల్స్‌కు వ్యతిరేకంగా ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారుల పనితీరు ఎలా కొనసాగింది? ఆర్ అండ్ బి ఆస్తులపై మున్సిపల్ కమిషనర్ పెత్తనం ఏంటి? క్వాలిటీ కంట్రోల్ చెకప్ చేయకుండా బిల్లులు ఎలా రిలీజ్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అవినీతి, పనుల నాణ్యత లేమి, అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు తీవ్రమైన విమర్శలు చేశారు.