Pensions in Andhra Pradesh | విజయనగరం: ఏపీ ప్రభుత్వం పింఛను లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లు తొలగిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది వరకు పింఛన్లకు అర్హులయ్యారని MSME, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) తెలిపారు. మొదటగా మే నెల నుంచి 93 వేల మంది వితంతువులు కొత్తగా పెన్షన్లు అందుకోబోతున్నారని తెలిపారు. అర్హులెన లబ్ధిదారులు పింఛన్ల గురించి ఆందోళన చెందవద్దని, ఇంకా అర్హులను గుర్తించి కూటమి ప్రభుత్వం త్వరలోనే వారికి పింఛన్ అందిస్తుందని పేర్కొన్నారు.


అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు


విజయనగరం జిల్లా గంట్యాడలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ‘అర్హులైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుంది. కేవలం అనర్హులు, ఫేక్ సర్టిఫికెట్లతో లబ్ధి పొందిన వారి పెన్షన్లు మాత్రమే తనిఖీ చేసి అధికారులు తొలగిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి అదనపు బారం తగ్గడంతో పాటు లబ్ధిదారులకు దాని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఏపీలో కొత్తగా ఆదాపు 5 లక్షల మంది వరకు పెన్షన్లకు అర్హులు అయ్యారు. త్వరలోనే వారందరికీ ఆయా కేటగిరిలలో పెన్షన్ మంజూరు చేస్తాం. 


స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం. అందుకోసం మండలానికి ఒక భవనం శిక్షణ కేంద్రంగా మార్చుతాం. మౌలిక సదుపాయాల కల్ప న, ఉపాధి కల్పన మహిళా స్వయం సాధికారత లో భాగంగా ప్రతి మండలాన్ని ఒక యూనిట్ గా చేసుకొని విజన్ డాక్యుమెంట్ ని రూపొందిస్తాం. P4 విధానం ద్వారా సమాజంలో ని నిరుపేద కుటుంబాలను దాతలకు కేటాయించి, వారి జీవన విధానం మెరుగు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాలతో పాటు, దేశ విదేశాలలో ఉన్న వారిని సైతం ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని' తెలిపారు.






ఏపీలో రైతు పక్షపాత ప్రభుత్వం 
గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలో ఏపీ ప్రభుత్వం రాయితీ పై 2.5 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను రైతు కుటుంబాలకు అందించింది. తాను వ్యవసయా పరికరాలను స్వయంగా అందించే అవకాశం రావడంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్న రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు. రైతులకు ఈ వ్యవసాయ పరికరాలు మరింతగా ఉపయోగపడతాయి. వ్యవసాయ రంగానికి మరింత చేయూత అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.