Revenue Law Reforms: మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏపీ రెవెన్యూ చట్టాల్లో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. రాష్ట్రంలో పలు సమస్యల్లో ఉన్న భూములను వినియోగంలోకి తీసుకొచ్చేందుకే చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినట్లు వివరించారు. ఈ విషయాలపై చర్చించేందుకే విశాఖలో ప్రాంతీయ రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పాల్గొనేందుకు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు వచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ సమస్యల్లో చిక్కుకున్న భూములను వినియోగంలోకి తీసుకు వచ్చేందుకే ఈ మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులను నియమించి సర్వే చేయిస్తున్నామని మంత్రి వివరించారు.



రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా..!


"ఆటో మ్యూటేషన్.. ఇంతవరకు మ్యూటేషన్ అనేది కష్టమైన ప్రక్రియ కింద ఉండేది. రిజిస్ట్రేషన్ ఒక చోట జరిగితే.. అది మళ్లీ రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేట్ కావడానికి చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆటో మ్యూటేషన్ ఇప్పుడు ఏమవుతదంటే... రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మరు క్షణాల మీద మ్యూటేట్ అవుతది. దానికి గాను మళ్లీ ఆ వ్యక్తులు ఇతర కార్యాలయాల చుట్టూ పోవాల్సిన అవసరం లేదు. ఆ సిస్టం తీసుకురావడం జరిగింది. దీనికి గాను అవసరమైనటువంటి రాకార్డులను అప్ డేట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అందుకే ఈ సర్వే. ఒకసారి ఆస్తిని ఇకముందు చాలా డీటెయిల్డ్ గా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం వస్తుంది." - మంత్రి ధర్మాన ప్రసాద రావు


మంత్రి ఆమోదం కూడా తీసుకుంటాం...!


గతంలో చుక్కల భూములు పేరుతో ప్రజలకు హక్కులు కల్పించకుండా చాలా ఆలస్యం జరిగిందని.. కానీ ఇప్పుడు కాల పరిమితి విధించి పనలు చేయిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక అధ్యయన కమిటీ వేసిందన్నారు. ఆ కమిటీ ఒక నివేదిక కూడా తయారు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు అసైన్డ్ భూములను విక్రయించే అధికారం లేదన్నారు. అంతకు మించిన సమర్థనీయ ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి సమర్పించి అందులోని మంచి అంశాల అమలుకు మంత్రి ఆమోదం కూడా తీసుకుంటామని వివరించారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరిగేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతుందని మంత్రి ధర్మాన ప్రసాద రావు పేర్కొన్నారు.


ఎలాంటి తప్పులు లేకుండా అన్ని వివరాలతో కూడిన డీటెయిల్డ్ గా వెరిపై అయ్యాకే ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసేందుకు ఈ చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి.సాయి ప్రసాద్, అదనపు కమిషనర్ ఇంతియాజ్, స్టాంపులు, రిజిస్టేషన్లశాఖ కమిషనర్ రామకృష్ణ, సర్వే సెటిల్ మెంట్ ల్యాండ్ రికార్డ్సు కమిషనర్ సిద్ధార్థ జైన్ లు కూడా పాల్గొన్నారు.