పెళ్లి ఫంక్షన్లలో ఎవరైనా ఆడవాళ్లు కాస్త బంగారం ఎవరైనా ఎక్కువ ధరిస్తే  గోల్డ్ ఉమన్ అంటూ ఉంటారు. అదే మగవాళ్ల చేతులకి ఓఉంగరం ఎక్కువగా కనిపించినా " వీడేందిరా?" అనుకుంటారు. అదే ఏకంగా ఐదు కేజీల బంగారాన్ని ఒంటిపైన వేసుకుని తిరుగుతూ ఉంటే ఊరుకుంటారా ? ఊరుకోరు కానీ గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రా అనే  బిరుదిచ్చేశారు. ఈ గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రా ఎవరో మీకు పరిచయం చేస్తాం. 


ముక్కా శ్రీనివాస్. ఉండేది విశాఖ పట్నం. ఆయన బయటకు వస్తే ఒళ్లంతా బంగారమే ఉంటుంది. దాదాపుగా ఐదు కేజీల బంగారాన్ని ఆయన ధరిస్తారు. చైన్లు, బ్రాస్‌ లెట్లు, ఉంగరాలు.. ఇలా ఎన్ని రకాలుగా బంగారు ఆభరణాలు పెట్టుకోవచ్చో అన్నీ పెట్టుకుంటారు. ఒకటి కాదు.. అంత కంటే ఎక్కువే పెట్టుకుంటారు. ఆయన బయటకు వస్తే చూసేందుకు జనం ఎగబడుతూంటారు. సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ చూసేవాళ్లయినా సరే ఆయన బయటకు వస్తే అబ్బురంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే బంగారానికి ఉన్న ఆకర్షణ అలాంటిది మరి. 


ముక్కా శ్రీనివాస్ ఇలా బంగారం ఒంటి నిండా ఎందుకు దిగేసుకుంటున్నారు ? అనే డౌట్ చాలా మందికి వచ్చింది. ఆయన తనకు ఉంది .. దాన్ని ఇలా ప్రదర్శించుకుంటున్నారని కొంత మంది విమర్శలు చేస్తారు. కానీ నిజం మాత్రం వేరే. పసుపు రంగులో ఉండే లోహాలను ధరిస్తే.. మంచిదని ఆయన నమ్మకం . శాస్త్రం కూడా అదే చెప్పిందని అంటారు. అదే సమయంలో చిన్న తనంలో ముక్కా శ్రీనివాస్ తల్లి బంగారం ధరించడాన్ని ప్రోత్సహించింది. బంగారం ధరిస్తే ఎంతో ఆత్మవిశ్వాసం వస్తుందని ఆమె తల్లి చెప్పింది. చిన్నప్పటి నుండి అలా అలవాటు చేసుకున్న ముక్కా శ్రీనివాస్ తన ఒంటిపై బంగారాన్ని అలా పెంచుకుంటూ పోతున్నారు. చివరికి ఇప్పటికి ఐదు కేజీలు అయింది. ముందు ముందు ఇంకా పెంచుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. 


ఇలా బంగారం వేసుకుని తిరుగుతూంటే మరి సెక్యూరిటీ ఎలా అనే డౌట్ రావొచ్చు.. దానికి కూడా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. నమ్మకంతో ధరిస్తున్న బంగారం ఇప్పుడు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇలాంటి గోల్డ్ మ్యాన్‌లు ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నారు. పుణెకు చెందిన ప్రశాంత్ కుమార్ ఇదే తరహాలో బంగారం ధరించి ప్రజల దృష్టిని ఆకర్షించారు. కొసమెరుపేమిటంటే.. ముక్కా శ్రీనివాసే ఐదు కేజీలు బంగారం ధరిస్తూంటే.. ఆయన భార్యకు ఇంకా ఎంత బంగారం కొనిచ్చి ఉంటారోనని సోషల్ మీడియాలో  నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 


ముక్కా శ్రీనివాస్ పవన్ కల్యాణ్ అబిమాని. జనసేన పార్టీలో కూడా కీలకంగా  ఉన్నారు.