Manyam Bandh: గిరిజనేతరులైన బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చద్దంటూ ఏపీ గిరిజన సంఘం అల్లూరి జిల్లాలోని మన్యం బంద్ క పిలుపునిచ్చింది. ఈ బంద్ కు ప్రతిపక్ష, వామపక్ష నేతలు నేతలు మద్దతిచ్చారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపేశారు. మరోవైపు దుకాణాలు, వ్యాపార సముదాయాలను స్వచ్చంధంగా మూసేశారు. గిరిజనులు చేపట్టిన ఈ బంద్ కు సీఐటీయూ మద్దతు ఇచ్చింది. పాలకొండ మండలం సింగన్న వలస కూడలి వద్ద ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంఘం అధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. నాన్ షెడ్యూల్ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని అని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే మల్లన్నగుడ, సిరికొండ గిరిజనులు ధర్నాలో పాల్గొన్నారు. జీఓ నెంబర్ 3 రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించి గిరిజన స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ప్లకార్డులు చేతు పట్టుకొని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బోయ వాల్మీకిలపై ఉన్న శ్రద్ధ.. జీఓ నెంబర్ 3 అమలుపై ఎందుకు లేదు మిస్టర్ సీఎం జగన్ అంటూ ప్రశ్నించారు. 


మరోవైపు మావోయిస్టుల లేఖ విడుదల


అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే బంద్ కు పిలుపునివ్వగా... మావోయిస్టు ఈ పరిణామాలపై లేఖ విడుదల చేశారు. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి గణేష్ పేరుతో వచ్చిన ఈ లేఖలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించింది. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చింది. మరోవైపు ప్రభుత్వం తీర్మానం మేరకు రిజర్వేషన్లు అమల్లోకి వస్తే తాము అన్ని విధాలుగా నష్టపోతామనే ఆదివాసీల భయం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్ల కోటాకు గండిపడుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ర్యాలీలు, సంప్రదాయ ఆయుధాలతో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.


ఆదివాసీల బంద్ పిలుపుతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం


ఇక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు సెగ మొదలైంది. అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకించింనందుకు బాధ్యత వహించాలన ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 5 నుంచి 6 షెడ్యూల్లు, 1/70 కింద వచ్చిన హక్కుల పరిరక్షణకు కట్టుబడాలని పట్టుబడుతున్నారు. ఆదివాసీ సంఘాల బంద్ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టు పార్టీ కదలికలపై నిఘా పెంచింది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెక్యూరిటీని పెంచడంతో పాటు తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్ల జాగ్రత్తలు పాటించాలనే సూచనలు జారీ అయ్యాయి. 


మార్చి 24న అసెంబ్లీలో తీర్మానం


మార్చి 24న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం రెండు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు, అలాగే దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏపీ అసెంబ్లీ తీర్మానాలు చేసింది. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ రెండు తీర్మానాలు కేంద్రానికి పంపుతున్నామన్నారు.  పాదయాత్ర సమయంలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారన్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల పరిస్థితులపై వన్ మ్యాన్ కమిషన్‌ ఏర్పాటుచేశామన్నారు. రాయలసీమ ప్రాంతంలో బోయ, వాల్మీకి కులాల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించిందన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేశామని సీఎం జగన్  తెలిపారు. ఎస్టీలు తనను గుండెల్లో పెట్టుకున్నారన్న సీఎం... వారిని కూడా అలాగే గుండెల్లో పెట్టుకుంటానన్నారు. ఈ తీర్మానంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండదన్నారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చేందుకు తీర్మానం చేశామన్నారు. దివంగత నేత వైఎస్‌ఆర్‌ హయాంలో ఈ తీర్మానం చేశారని గుర్తుచేశారు.