YCP vs Pawan Kalyan: సీఎం జగన్ చేపట్టిన వికేంద్రీకరణక పార్టీలకు అతీతంగా నాయకులు మద్దతివ్వాలని, లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15వ తేదీన చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని 2019 డిసెంబర్ లోనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళనీయకుండా ప్రతిపక్షాలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయని మంత్రి అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ రాజధానిగా వద్దంటూ అమరావతి రైతులు దండయాత్రగా రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. 


మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 15వ తేదీన జరిగే విశాఖ గర్జన ఏ వ్యక్తికో, ఏ కులానికో సంబంధించినది కాదని, ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవ పోరాటమని అన్నారు. రాజకీయ లబ్ది కోసం తాము ఈ పోరాటం చేస్తున్నామని వివిధ పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారని, వారే వచ్చి ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకుని, లబ్ధి అంతా వారే పొందినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకు విషం చిమ్ముతున్నారని ఆయన ప్రతిపక్షాలను విమర్శించారు.


జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ... విశాఖ గర్జన ఉద్యమానికి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని.. దీనికి మద్దతుగా గ్రామ, మండల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ ఉద్యమానికి మీడియా వెన్నుదన్నుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి వాళ్లు న్యాయపరంగా, రాజకీయంగా అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 


ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికే ఈ టూర్..


ప్రజా గర్జన పక్కదారి పట్టించేందుకే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారుని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, అందులో ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వను తెలిపారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు రథయాత్రలు, పాదయాత్రలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో.. ఆంధ్ర ప్రజలు పవన్ కల్యాణ్ కు గట్టి సమాధానం.. సిగ్గులేకుండా మళ్లీ వచ్చి ప్రవచనాలు చెప్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  


పవన్ కల్యాణ్ చంద్రబాబు దత్త పుత్రుడు..


పవన్ కల్యాణ్.. చంద్రబాబు దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, ఎంపీ మార్గాని భరత్ రామ్ విమర్శించారు. చచ్చు రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నారని పవన్ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. బీజేపీకి బద్ధ శత్రువు అయిన టీడీపీకి కొమ్ము కాస్తుంటారని.. ఇదేం రాజకీయమని ప్రశ్నించారు. జనసేన అధినేత బీజేపీకి మద్దతిస్తున్నారా లేక టీడీపీకి మద్దతిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి రైతుల ముసుగులో పాదయాత్ర డ్రామా ఆడిస్తుంటే, ఈ ప్యాకేజీ స్టార్ జనవాణి పేరుతో.. ఆ డ్రామా పాదయాత్రకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ పై అభిమానం ఉంటే 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు బీజేపీతో సఖ్యతగానే ఉన్నారని.. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతిని అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. కొంత మంది ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తారని.. మరికొంత మంది సంపాదించుకునేందుకు వస్తారు.. మీరు రెండో కోవకు చెందిన వాళ్లని ప్రజలు భావిస్తున్నారంటూ భరత్ ఎద్దేవా చేశారు.