పోలీసు నియంత్రిత గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా కాకినాడ అపోలో ఆసుపత్రి నుంచి విశాఖపట్నం కిమ్స్‌ ఆసుపత్రికి మానవ మూత్రపిండాలను సకాలంలో చేర్చారు. పోలీసుల సహకారంతో దిగ్విజయంగా పూర్తిచేసిన ఈ టాస్క్‌ ద్వారా సకాలంలో మూత్రపిండాలు నిర్దేశిత ఆసుపత్రికి చేర్చి ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తిచేసినట్లు కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీనికి గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేసి సహకరించిన కాకినాడ జిల్లా ఎస్సీ ఎస్‌.సతీష్‌ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


కాకినాడ నుంచి విశాఖకు ప్రత్యేక అంబులెన్స్‌లో..


కాకినాడ అపోలో ఆసుపత్రి నుంచి గురువారం ఉదయం 11.45 గంటలకు మానవ మూత్రపిండాలతో ఓ అంబులెన్స్‌ బయలు దేరింది.. కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్లేవరకు ట్రాఫిక్‌, శాంతిభద్రతల విభాగ పోలీసుల సమన్వయంతో విశాఖపట్నం కిమ్స్‌ ఆసుపత్రికి మధ్యాహ్నం 1.45 గంటలకు కెవలం రెండు గంటల వ్యవధిలో అంబులెన్స్‌ చేరుకుంది. దీంతో కిడ్నీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ విజయవతంగా పూర్తి అయ్యిందని ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. గ్రీన్‌ఛానెల్‌ సక్రమంగా అమలుచేసిన పోలీసులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ అభినందించారు.  


బ్రెయిన్‌ డెడ్‌ అయిన మహిళ


కాకినాడ అపోలో ఆసుపత్రిలో కొన్ని రోజులుగా బ్రెయిన్‌ డెడ్‌తో  పోరాడుతున్న 55 ఏళ్ల మహిళ ఇక కోలుకునే అవకాశం లేదని ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారు. అయితే వైద్యుల సూచనపై ఆమె కుటుంబ సభ్యులు ఆమె రెండు కిడ్నీలను దానం చేసి ఇరువురి ప్రాణాలు కాపాడ్డానికి ముందుకు వచ్చారని తెలిపారు. దీంతో గురువారం ఆమె రెండు కిడ్నీలను వేరుచేసి ఒక కిడ్నీని కాకినాడ అపోలో ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒకరికి అమర్చారు. మరొక కిడ్నీని విశాఖపట్నం కిమ్స్‌ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మరొకరికి అమర్చేందుకు కాకినాడ అపోలో ఆసుపత్రి నుంచి విశాఖపట్నం కిమ్స్‌ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.


దీంతో ఆసుపత్రి వైద్యులు కాకినాడ ఎస్పీ సతీష్‌ కుమార్‌ను సంప్రదించడంతో కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా పోలీసులను అనుసంధానం చేసి గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాకినాడ అపోలో ఆసుపత్రిలోను, విశాఖపట్నం కిమ్స్‌ ఆసుపత్రిలోనూ చేసిన ఆపరేషన్లు విజయవంతం అయినట్లు తెలిపారు.