Janasena Chief Pawan Kalyan: విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొత్తులు హాట్ టాపిక్ అవుతున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి పొత్తులపై స్పందించారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, టీడీపీ, బీజేపీతో జనసేన కలిసి వెళ్లడమా లేదంటే బీజేపీతో కలిసి పోటీ చేయడమా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు చీలకూడదన్నదే జనసేన ఉద్దేశం అని, ఏదైనా సరే ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయన్నారు. సీఎం పదవి పై నా ఆసక్తి ఇప్పటికే చెప్పాను.. సీఎం పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు తర్వాతే సీఎం పదవిపై నిర్ణయం ఉంటుందన్నారు. 
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘జగన్ ఒక వ్యాపారి, ఒక క్రిమినల్ అని ఆయన నేర విధానాన్ని కొనసాగిస్తున్నారు. మత్స్యకారుల వలసలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఇట్లాగే దోపిడీ జరిగింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తెలంగాణలో అడ్డగోలుగా దోపిడీ జరిగింది. అందుకే ఆంధ్రా వాళ్ళను తరిమేశారు.. వరంగల్ లో జగన్ ను తరిమేశారు. మూడు రాజధానులు అంటే ఎలా సాధ్యం అవుతుంది. వైసీపీ వాళ్ళు ఉత్తరాంధ్రలో ముప్పై వేల ఎకరాలు దోచేశారు. అందుకే ఈ ప్రాంతంపై వారికి ప్రేమ. స్థానిక నాయకులను అడ్డు పెట్టుకుని దోచేసే ప్రయత్నం జరుగుతోందని’ ఆరోపించారు. 


విశాఖలో క్రైం రేట్ పెరిగింది..
‘ప్రశాంతంగా ఉండే విశాఖలో క్రైం రేట్ పెరిగి పోయింది. రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయం. ఏదైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయటం లేదు. ఏపీ నేరాలకు నిలయం అయింది. ఇప్పుడు బిహార్ చాలా బాగుంది. ఉత్తరాంధ్ర భూ దోపిడీ పై మాట్లాడటానికి ఇక్కడ నాయకులు లేరు. అనకాపల్లలో ఖనిజ సంపద దోచేస్తున్నరు. అమ్మఒడికి డబ్బులు లేవు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు ఖాతరు చేయడం లేదు. మకవరపాలెం మండలంలో 174 జీవో ద్వారా నిధులు మంజూరు. కానీ ఫారెస్ట్ లాండ్ లో నిబంధనలు ఖాతరు చేయకుండా దోపిడీ జరిగింది. ఖనిజ తవ్వకం ఒకరికి కేటాయిస్తే మరొకరికి ఇస్తోంది జగన్ ప్రభుత్వం. పోలీసులు చూస్తుండగా బోట్ తగలబెట్టారు. బ్రిటీష్ పాలన కంటే ఏపీ దారుణంగా తయారైంది.


కార్మికులకు రూ.5 వేలు జీతం కూడా ఇవ్వరు, కానీ వైసీపీ నేతలు వేల కోట్లు దోచేస్తారు. రాయల సీమలో వీలు పడదని, ఉత్తరాంధ్ర దోపిడికి శ్రీకారం చుట్టారు. గాజువాక లో నిర్మాణాల కోసం వైసిపి వారు ఒక రేటు పెట్టేశారు. అగనం పూడి టోల్ గేట్ 25 సంవత్సలుగా నడుస్తోంది... ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ కీ చెందిన కంపెనీ కి ఇచ్చేశారు. మద్యం మీద ఆదాయం భారీగా వస్తున్నా, అధిక శాతం దోపిడీ జరుగుతోంది. వాహన మిత్ర అందరికీ అందదని, డ్రైవర్ లు గ్రీన్ ట్యాక్స్ గురించి మాట్లాడటం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ప్రతి మూడు నెలలకు వేల రూపాయలు దోపిడీ. ఏపీలో పరిస్థితి మారాలంటే ప్రభుత్వం మారాలి. 


టీడీపీ హయాంలో తప్పు జరిగితే సీఎం జగన్ సరి చేయొచ్చు కదా. జనసేన గురించి అడగటానికి వాళ్లు ఎవరు అని పవన్ కళ్యా్ణ్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి క్యాప్టీవ్ మైన్స్ కోసం వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని అడగాలి అన్నారు. తాను రిపోర్టర్ కి రెస్పెక్ట్ ఇస్తానన్నారు. కానీ ఓట్లు చీలకూడదు అనడానికి కారణం సాక్షి పేపర్ ఓనరే కదా అని జగన్ పై వ్యాఖ్యలు చేశారు. 151 ఎమ్మెల్యేలు ఉండి అద్భుతమైన పాలన చేసి ఉన్న నేత జగన్ అయితే తాను చాలా సంతోషించే వాడ్ని అన్నారు. రాష్ట్రంలో 30 వేల అమ్మాయిలు, మహిళలు మిస్సింగ్ అయితే, ఎలాంటి సమీక్షలు పెట్టకుండా, పైగా ఈ విషయాన్ని బహిర్గతం చేసిన తనపై వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లడారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.