ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదని, ఓ వ్యాపారి అని అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అరకులో బాక్సైట్ కోసం కొండను తవ్వడానికి ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే, వీటిని అడ్డుకోవాలని ప్రజలు తమను కోరారన్నారు. మత్స్యకారులు గుజరాత్, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని, ఇందుకు సీఎం జగన్ కారణమంటూ మండిపడ్డారు. ఏపీ నేరాలకు నిలయంగా మారిందని, తాడేపల్లిలో నేరాల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుందన్నారు.
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. అరకులో బాక్సైట్ కోసం అద్భుతంగా ఉన్న కొండను తవ్వేందుకు లైసెన్సులు ఇస్తున్నారని, వీటిని అడ్డుకోవాలని గిరిజనులు తనను కోరారన్నారు. తెలంగాణలో ఇలాగే జరిగిందని, కానీ వీటికి ఓ పరిమితి ఉండేదన్నారు. ఏపీలో చూస్తే ఉత్తరాంధ్రలో భూ దోపిడీ జరుగుతుందని, లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదు అని వ్యాపారి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనవాణిలో 340 నుంచి 370 పిటీషన్లు రాగా, అందులో మొత్తం తమ భూములు దోచుకున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు.
రూ.500 ఎప్పుడు తిరిగిస్తావని అడిగితేనే హత్య చేశారని జనవాణిలో ఫిర్యాదు వచ్చింది. 30 వేల అమ్మాయిలు, మహిళలు మిస్సి్ంగ్ అని చెబితే వైసీపీ నేతలు నాపై దుష్ప్రచారం చేశారు. కానీ హోం శాఖ, పార్లమెంట్లో ఏపీలో అమ్మాయిల మిస్సి్ంగ్ పై ప్రకటన చేయగానే వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. పోలీసులు సైతం మీతో ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయా, ఆధారాలు చూపించండి అని తనను అడిగినట్లు చెప్పారు. కానీ అమ్మాయిల తల్లిదండ్రులు కొన్ని కారణాలతో ఫిర్యాదులు చేయలేరని, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేరని అభిప్రాయపడ్డారు. చోరీకి వచ్చి అత్యాచారం చేశారని పోలీసులు సైతం నేతల తరహాలో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం నివాసం ఉన్నచోటే రాష్ట్రంలో అత్యధిక క్రైమ్ రేట్ ఉందని, ఏపీలో ఏం తాగుతున్నరో, గంజాయి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఓవర్ టెక్ చేయబోయిన వ్యక్తిని వారించబోతే వారిపై ఆ దుర్మార్గులు దాడి చేశారని, పోలీసుల వద్దకు వెళితే కేసులు వద్దు అని చెబుతున్నారని చెప్పారు. కేసులు వెలుగులోకి రావడానికి మీడియా కీలక పోషించిందన్నారు. గనులు, మైనింగ్ పై రెవెన్యూ, అటవీశాఖ అధికారులు అందరూ ఏకమై దోపిడీకి సహకరిస్తున్నారని తమకు సమాచారం వచ్చిందన్నారు.
విశాఖ జిల్లాలో 6 లాటరైట్ లీజులు ఉండే అందులో 5కు పర్మిషన్ లేదన్నారు. ఒక్క మైనింగ్ లో 5 వేల టన్నులకు అనుమతి ఉంటే ఇప్పటివరకూ 5 లక్షల టన్నులు అక్రమంగా తవ్వినట్లు చెప్పి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలో ఆ స్థాయిలో దోపిడీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. మన్యంలో, ఉత్తరాంధ్రలో ఖనిజ తవ్వకాలు ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్న దోపిడీపై జనసేన పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఫొటోలు దిగడం వరకే జగన్ అమ్మఒడి బాగుంటుందని, కానీ అక్కడ స్కూళ్లు లేవని, కిలోమీటర్ల మేర బాలికలు ప్రయాణిస్తూ రోజు నరకం అనుభవిస్తున్నారని ఏపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు.