రెండు రోజు ఉత్కంఠ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విశాఖ నుంచి రిటర్న అయ్యారు. ఓ హోటల్ వేదికగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సాగర తీరంలో రగులుతున్న రాజకీయం ఇప్పుడు మంగళగిరికి షిప్ట్ అయింది. పవన్ విశాఖ నుంచి మంగళగిరి పయనమయ్యారు. 


విశాఖ నుంచి బయల్దేరే ముందు ఓ వీడియో రిలీజ్ చేసిన పవన్ కల్యాణ్‌.. ప్రభుత్వం తీర్పు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ లీడర్లపై పెట్టిన కేసులను తప్పు పట్టారు. ఆ కేసులపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇప్పటికే కొందరికి బెయిల్ వచ్చిందని పేర్కొన్నారు. రిమాండ్‌లో ఉన్న వారి కోసం హైకోర్టు పిటిషన్ వేశామని... వారికి కూడా బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న చర్యలను పవన్ కల్యామ్ తీవ్రంగా ఖండించారు. కనీసం తన కోసం వెయిట్ చేస్తున్న వారిని కలిసేందుకు కాదు కదా.. దూరం నుంచి వారికి అభివాదం చేసేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని ఆక్షేపించారు. దీని కచ్చితంగా సమాధానం చెప్పే రోజులు వస్తాయన్నారు పవన్. ఇలాంటి ఆంక్షలే భవిష్యత్తులో విధించకుండా జగన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేయడానికి న్యాయ నిపుణులతో చర్చిస్తామన్నారు.


విశాఖలోని ఓ హోటల్‌లో ఉన్న పవన్ కల్యాణ్... అరెస్టై బెయిల్‌పై విడుదలైన నేతలతో సమావేశమయ్యారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. మిగతా వారిని విడిపించేందుకు అనుసరించాల్సి  వ్యూహంపై కూడా పార్టీ లీడర్లతో మాట్లాడారు. అక్రమ అరెస్టులు, హత్యాయత్నం కేసులపై న్యాయపోరాటం చేసేందుకే మంగళగిరి పయనమైనట్టు తెలిపారు పవన్. 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కలవనున్నారు. విశాఖలో జరిగిన సంఘటనలు, పోలీసులు, ప్రభుత్వం తీరుపై గవర్నర్ కు జనసేనాని ఫిర్యాదు చేయనున్నారు. జనసేన నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ ఆరోపిస్తుంది. గవర్నర్ తో సమావేశం అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ వెళ్లనున్నారు. 


పోలీసుల ఆధీనంలో విశాఖ 
పవన్‌ వెళ్లే ప్రత్యేక హెలికాఫ్టర్ విశాఖ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. పవన్ ఎయిర్ పోర్టుకు వచ్చే మార్గంలో భారీగా పోలీసులను మోహరించారు. విశాఖ మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. 


విశాఖలో టెన్షన్ 


రెండు రోజులుగా విశాఖలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన జనవాణి కార్యక్రమానికి శనివారం సాయంత్రం పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నారు. పవన్ ఎయిర్ పోర్టుకు వస్తున్న క్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో విశాఖ గర్జన ముగించుకుని తిరిగి వెళ్తోన్న మంత్రులు ఎయిర్ పోర్టుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. జనసేన కార్యక్రమలు కొందరు మంత్రుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 71 మందిపై కేసులు పెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో జనవాణి కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. విశాఖలో పోలీసులు యాక్ట్ అమల్లో ఉందని ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించవద్దని పోలీసులు పవన్ కల్యాణ్ నోటీసులు అందించారు. పవన్ ను నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పవన్ ను చూసేందుకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులను చెదరగొట్టారు. హోటల్ కు చుట్టుపక్కల పోలీసులు ఆంక్షలు విధించారు.