Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖ నుంచి విజయవాడకు రానున్నారు. అనంతరం గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను పవన్ కల్యాణ్ ను కలవనున్నారు. విశాఖలో జరిగిన సంఘటనలు, పోలీసులు, ప్రభుత్వం తీరుపై గవర్నర్ కు జనసేనాని ఫిర్యాదు చేయనున్నారు. జనసేన నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ ఆరోపింస్తుంది. గవర్నర్ తో సమావేశం అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ వెళ్లనున్నారు.
పోలీసుల ఆధీనంలో ఎయిర్ పోర్టు
ఇప్పటికే ప్రత్యేక హెలికాఫ్టర్ విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. పవన్ ఎయిర్ పోర్టుకు రానుండడంతో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసుల అధీనంలో విశాఖ విమానాశ్రయం ఉంది. పవన్ రాకపై పూర్తి సమాచారం లేదని పోలీసులు, ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల ఫ్లైట్ వివరాలు తెలుసుకున్న అనంతరం లోపలికి పంపిస్తున్నారు అధికారులు.
ఒక వేళ పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్టుకు వస్తే ఆయన వెహికల్ తో పాటు మరొక వాహనానికే ఎయిర్ పోర్ట్ లోపలికి అనుమతి ఇచ్చారు.
విశాఖలో టెన్షన్
రెండు రోజులుగా విశాఖలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన జనవాణి కార్యక్రమానికి శనివారం సాయంత్రం పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నారు. పవన్ ఎయిర్ పోర్టుకు వస్తున్న క్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో విశాఖ గర్జన ముగించుకుని తిరిగి వెళ్తోన్న మంత్రులు ఎయిర్ పోర్టుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. జనసేన కార్యక్రమలు కొందరు మంత్రుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 71 మందిపై కేసులు పెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో జనవాణి కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. విశాఖలో పోలీసులు యాక్ట్ అమల్లో ఉందని ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించవద్దని పోలీసులు పవన్ కల్యాణ్ నోటీసులు అందించారు. పవన్ ను నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పవన్ ను చూసేందుకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులను చెదరగొట్టారు. హోటల్ కు చుట్టుపక్కల పోలీసులు ఆంక్షలు విధించారు.
నోవాటెల్ వద్ద భారీగా బందోబస్తు
విశాఖలో పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు హోటల్ వద్దకు తరలివస్తారన్న సమాచారంతో పోలీసులు ఆంక్షలు విధించారు. హోటల్లోకి ఎవరూ వెళ్లకుండా అన్ని గేట్ల వద్ద పోలీసులు మోహరించారు. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన ఘటనలో అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలను కోర్టు విడుదల చేయడంతో వారంతా పవన్‌ను కలిసేందుకు వచ్చే అవకాశముంది. నోవాటెల్ వద్దకు వచ్చే జనసేన నేతలు సహా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వేరే చోటకి తరలిస్తున్నారు. హోటల్ పరిసరాల్లో మీడియా ప్రతినిధులు మినహా ఇతరులు లేకుండా ఖాళీ చేస్తున్నారు.
కేంద్రం కల్పించుకోవాలి-పోతిన మహేశ్
జనసేనాని పవన్ కల్యాణ్ ను అడ్డుకోవడం, ప్రజాస్వమ్యానికి చీకటి రోజని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ అన్నారు. జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే పోలీసులు పని చేస్తున్నారని,చట్ట ప్రకారం నడుచుకోవడమే పోలీసులు మరచిపోయారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ జనవాణి నిర్వహిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీశారు. ఏపీలో పరిస్థితులను చక్క దిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ కు ఏపీ పోలీసులు రక్షణ కల్పించలేని పరిస్థితి ఉందని అర్థమైందని, వెంటనే కేంద్రం కల్పించుకొని, జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కోరారు. వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ విజయాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.