Home Minister Vangalapudi Anitha Sweet Warning To Police Officers : వైసీపీ సేవలో తరిస్తున్న పలువురు పోలీసు అధికారులకు హోం మంత్రి వంగలపూడి అనిత స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ప్రేమ ఉన్న అధికారులు, ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని లేకపోతే రాజీనామా చేయాల్సిందిగా ఆమె సూచించారు. సింహాచలం అప్పన్న స్వామిని సోమవారం (జూన్ 17న) ఉదయం ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కొంత మంది పోలీసు అధికారులు ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరించారని ఆరోపించారు. ఇప్పటికీ వారిలో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టు వ్యవహరిస్తున్నారని, అటువంటి వారికి జగన్‌పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆమె స్పష్టం చేశారు.


తప్పు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు 
శాంతి భద్రతల విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తానని హోం మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్నను కోరుకున్నట్టు ఆమె వెల్లడించారు. మంత్రి పదవి వచ్చిన తరువాత అప్పన్న స్వామిని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చానని, సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తానన్నారు. పంచ గ్రామాల భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. 


పోలీస్‌ అధికారులతో కీలక సమీక్ష


అనంతరం సోమవారం సాయంత్రం విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో పోలీసు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు హబ్‌గా మార్చేశారన్నారు. కనీసం పోలీస్‌ స్టేషన్ల నిర్వహణకు నిధులు కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. గంజాయి వినియోగాన్ని నియంత్రించేందుకు, పూర్తిగా అణచివేతకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను తాము ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. విశాఖలోనే గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, ఇప్పటి వరకు 1252 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. గంజాయి నివారణకు ప్రజా సహకారం కూడా కావాలన్నారు. ప్రజలకు మంచి చేసే దృక్పథంతోనే పోలీసులు ఉండాలని స్పష్టం చేశారు.


యువత గుంపులుగా చేరి గంజాయి సేవించడం, రాత్రిపూట, చీకటిగా ఉండే ప్రాంతాల్లో నిలబడి గంజాయి మత్తులో దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లు, ఈవ్‌టీజింగ్‌ వంటి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఏజెన్సీతో పాటు ఒడిశా నుంచి గంజాయి విచ్చలవిడిగా నగరానికి దిగుమతి అవుతోందని, నగరం నుంచి దేశ వ్యాప్తంగా సరఫరా జరుగుతోందన్నారు. వైసీపీ నేతలకు గంజాయి రవాణాలో ప్రమేయం ఉండడంతో నియంత్రణకు కఠినచర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారని మంత్రి ఆరోపించారు. గత ఐదేళ్లలో గంజాయి రవాణా, విక్రయాలపై ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం దీనికి అద్దం పడుతోందన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా తయారుచేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. 


డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయం 
గంజాయి కారణంగా రాష్ట్రంలో తలెత్తుతున్న హింస, ఇతర సమస్యలకు పరిష్కారం చూపేందుకు వీలుగా ఇకపై గంజాయిపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. చెక్‌పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు వంగలపూడి అనిత వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి నగరంలో రాత్రిపూట గంపుగా ఉండే యువతను, చీకట్లో ఉంటూ పిచ్చాపాటిగా మాట్లాడుకునే వారిని, బస్‌స్టాపుల్లో కనిపించే ఆకతాయిలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించాలని, సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశించినట్టు తెలిపారు.


గంజాయి కేసుల్లో పట్టుబడేవారు ఏ పార్టీవారైనా క్షమించే ప్రసక్తే లేదన్నారు. గంజాయి డీ అడిక్షన్‌ సెంటర్లు పెంచడంతోపాటు, కేజీహెచ్‌లో ప్రత్యేకంగా ఒక బ్లాక్‌ను కేటాయించే ప్రతిపాదన ఉందన్నారు. మూడు నెలల్లో గంజాయికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేస్తామని హోంమంత్రి ఆశాభావానిన వ్యక్తం చేశారు. ఒక టీచర్‌గా పిల్లలను సరిదిద్దినట్టుగానే వ్యవస్థను కూడా సరిదిద్దుతానని మంత్రి అనిత ధీమా వ్యక్తం చేశారు.