GIS 2023 Vizag: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో దేశవిదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక పాలసీ, చేపట్టే కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు. పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రారంభ కార్యక్రమంలో అంబానీ సహా పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ఇందులో దేశ, విదేశా పెట్టుబడుదారులు ఉన్నారు. ఏపీలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు ప్రకటించడంతోపాటు ఏపీలో నిర్భయంగా పెట్టుబడులు పెట్టొచ్చని సలహా ఇచ్చారు.
ఏపీలో నైపుణ్యమైన వనరులు ఉన్నాయన్నారు శ్రీసిమెంట్ ఛైర్మన్ హరిమోహన్. జగన్ నాయకత్వంలో ఏపీ పరిశ్రమల హబ్‌గా మారిందన్నారు. కర్బన రహిత వాతావరణం కోసం ఏపీ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఏపీ పారిశ్రామీకరణలో శ్రీసిమెంట్ తన పాత్ర పోషిస్తుందని హామీ ఇచ్చారు. ఐదు వేల కోట్లతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీని ద్వారా ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది.
ఆరోగ్య రంగంలో ఏపీ సర్కారు కృషిని పొగిడారు అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్‌పర్శన్ ప్రీతారెడ్డి. ఏపీ సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్ కృషిని ఈ వేదికపై గుర్తు చేశారు ప్రీతారెడ్డి. నాఫ్ సీఈవో సుమ్మిత్ బిదానీ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ఏపీలో రోడ్ కనెక్టివిటీ, విద్యుత్ సౌకర్యాలు బాగున్నాయన్నారు. ఇన్వెస్టర్స్ సదస్సు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఏపీలో పదివేల కోట్ల పెట్టుబడులకు జిందాల్ స్టీల్స్ ముందుకు వచ్చింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మాట్లాడిన నవీన్ జిందాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈ మధ్యే ఈ సంస్థ శంకుస్థాపన కూడా చేసింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు టెస్లా కో ఫౌండర్ మార్టిన్ ఎబర్ హార్డ్. గ్రీన్ ఎనర్జీ పట్ల ఏపీ ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు. సుస్థిర అభివృద్ధి ప్రపంచానికి చాలా అవసరమని తెలిపారు.
2002లో కార్ల తయారీ కంపెనీ చాలా క్రేజీగా ప్రారంభమైంది. అసలు ఇలాంటి ఆలోచనతో ఆటోమొబైల్ కంపెనీ పెట్టాలనే ఆలోచన ఎవరూ చేయరేమో. అంతా కొత్తవారితా మేం స్టార్ట్ చేశాం అందులో ఒక్కరికి కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అనుభవం లేదు. అయినా ప్రారంభించాం. మొత్తం బాధ్యత తీసుకున్నాం. ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వాటికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో మేం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం.. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకొని మీ ముందు నిలబడ్డాం. నాకు ఏపీలో ఉన్న స్టార్టప్‌ల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులు గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. - మార్టిన్ ఎబర్‌హార్డ్, టెస్లా సహ వ్యవస్థాపకుడు & మాజీ CEO
ఏపీలో చాలా రంగాల్లో వెంటవెంటనే అనుమతులు వస్తున్నాయని...ఇది పారిశ్రామికవేత్తలకు చాలా ఆనందదాయమన్నారు టోరే ఇండస్ట్రీస్ ఎండీ మసహిరో యమగూచి. రాష్ట్ర అభివృద్ధిలో కియా పాత్ర చాలా కీలక పాత్ర పోషించిందన్నారు కియా ఇండియా ప్రతినిధి కబ్‌డోంగ్‌లి. ప్రభుత్వ సహకారాలు కియా అబివృద్ధికి దోహదపడిందన్నారు. ఏపీలో కియా కార్యకలాపాలు సులువుగా సాగిందన్నారు.