పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు 2023లో అతిథులను మైమరిపించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మన దేశంలోని కార్పొరేట్ దిగ్గజ సంస్థల అధిపతులు సహా, విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులకు చక్కని ఆతిథ్యం ఇవ్వనుంది. వారి కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల వెజ్, నాన్‌వెజ్ రుచులను వీరికి వడ్డించనున్నారు. ఇవాళ (మార్చి 3) మధ్యాహ్నం భోజనంలో బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాలా, మటన్ కర్రీ, చికెన్ పలావ్ సిద్ధం చేస్తున్నారు. వెజ్ ఫుడ్స్‌లో మష్రూం, క్యాప్సికం, ఆలూ గార్లిక్ ఫ్రై, కేబేజీ మటర్ ఫ్రై, వెజ్ పలావ్, రోటీ, కుల్చా, పన్నీర్ బటర్ మసాలా, మెంతికూర–కార్న్ రైస్, మిర్చి కా సలాన్, టమాటా పప్పు, బీట్‌రూట్ రసం, మజ్జిగ పులుసు, గోభీ ఆవకాయ, నెయ్యి, వడియాలు, ద్రాక్ష పండ్ల పచ్చడి, ఊరమిరపగాయ ఉంటాయి. డిజర్ట్స్, స్వీట్స్ విభాగంలో కట్ ఫ్రూట్స్, ఐస్‌క్రీం, పేస్ట్రీ, కాలా జామున్, జున్ను చంద్రకాంతలు రెడీ చేస్తున్నారు.
రెండో రోజు శనివారం (మార్చి 4) లంచ్‌లో రష్యన్ సలాడ్స్, వెజ్ సలాడ్‌లతో పాటు రుమాలి రోటీ, బటర్ నాన్ ఇస్తారు. నాన్ వెజ్ రకాల్లో ఆంధ్రా చికెన్ కర్రీ, చేప ఫ్రై, క్యారెట్ బీన్స్ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కారం, గోంగూర, రొయ్యల కూర, ఎగ్ మసాలా, మటన్ పలావ్ వెజ్ ఐటమ్స్‌లో వెజ్ బిర్యానీ, కరివేపాకు రైస్, కడాయ్ పన్నీరు కూర, బెండకాయ–జీడిపప్పు ఫ్రై, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు, ఉలవచారు–క్రీం వంటివి ఉన్నాయి. ఇంకా డిజర్ట్స్, స్వీట్స్‌లో.. ఫ్రూట్స్, ఐస్‌క్రీం, బ్రౌనీ, గులాబ్‌జామ్, అంగూర్ బాసుంది, డబుల్‌కా మీఠా వడ్డించనున్నారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, వడ, టమాటా బాత్, హాట్ పొంగల్, ఉదయం స్నాక్స్‌లో ప్లమ్ కేక్, డ్రై కేక్, వెజ్ బుల్లెట్, మఫిన్స్, స్ప్రింగ్ రోల్స్, సాయంత్రం స్నాక్స్‌లో టీ, కాఫీలతో పాటు కుకీస్, చీజ్ బాల్స్, డ్రై ఫ్రూట్ కేక్, ఫ్రూట్ కేక్, కట్ మిర్చి బజ్జీలు ఉంటాయి.
చిరుధాన్యాలతో చిత్రపటాలు
ఈ సమ్మిట్‌లో కాస్త భిన్నంగా ఉండేలా ప్రముఖుల చిత్రపటాలను చిరుధాన్యాలతో రూపొందించారు. మోదీ, వైఎస్ జగన్‌తో పాటు పలువురి పారిశ్రామిక దిగ్గజాల ఫోటోలను ఫ్రేములుగా పూర్తిగా చిరుధాన్యాలతో ఏర్పాటు చేశారు. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన వేళ.. ప్రజల్లో ఆసక్తి, అవగాహన పెంచేందుకు విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ విభిన్నంగా ఛాయాచిత్రాలను రూపొందించారు.
వచ్చిన వారికి ప్రత్యేక కిట్లు కూడా..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక జ్ఞాపికల కిట్స్‌తో పాటు గిరిజన సహకార సంస్థకు చెందిన ఉత్పత్తుల కిట్లను కూడా అందించనున్నారు. స్వచ్ఛమైన ప్రేమను పంచే గిరిజనులు సేకరించిన కల్తీ లేని ఉత్పత్తులను జ్ఞాపికలుగా ఇవ్వనున్నారు. నాణ్యమైన జీసీసీ ఉత్పత్తుల్ని దేశ విదేశీ ప్రముఖులకు పరిచయం చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు జీసీసీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, జీసీసీ ఎండీ సురేష్‌కుమార్ తెలిపారు. నాణ్యమైన తేనె, హెర్బల్ ఆయిల్, పెయిన్ రిలీఫ్ నుంచి అరకు కాఫీ వరకూ 12 రకాల జీసీసీ ఉత్పత్తులు ఈ కిట్లలో ఉన్నాయి.