Ganta On Rushikonda : విశాఖలోని రుషికొండ బీచ్ వద్ద ఎంట్రీ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు  మండిపడ్డారు.  వైజాగ్ లో తాకట్టు పెట్టాలకున్నవన్నీ  పెట్టేశారు. అమ్మలనుకున్నవన్నీ అమ్మేశారూ..... కూల్చాలనుకున్నవన్నీ కూల్చేశారు...వెయ్యాలకున్న పన్నులన్నీ వేసేశారు...ఇప్పుడేమో బీచ్ ల వద్ద పార్కింగ్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.  వైజాగ్ అంటే అందమైన బీచ్‌లు గుర్తుకొస్తాయి, సముద్రతీరంలో కాసేపు సేదదీరితే ఒత్తిడి తగ్గుతోందని విశాఖ వాసులు సాయంత్రం అలా బీచ్‌కు వెళ్తుంటారు, ఐతే ఇకపై 'బ్లూ' ఫాగ్ గా  గుర్తింపు ఉన్న రుషి కొండ బీచ్‌కు వెళ్లాలంటే 20 రూపాయల ఎంట్రీ ఫీజు పెట్టడంతో ప్రకృతి ప్రేమికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. 


మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే బీచ్ ల వద్ద పార్కింగ్ రుసుం కింద ద్విచక్ర వాహనాలకు రూ. 10, కార్లకు రూ.30, బస్సులకు రూ.50 వసూలు చేస్తున్నారు  ఇప్పుడేమో బీచ్ లోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజ్ పెట్టారు. తీరం అందాలు ఆస్వాదించడానికి  ప్రభుత్వమే అధునాతన హంగులతో బీచ్ ‌లను అభివృద్ధి చేసి పర్యాటకులను నగరవాసులను ఆకట్టుకోవాల్సింది పోయి  ఎంట్రీ ఫీజులు పెట్టి పర్యాటకుల నడ్డి విరవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ ఎంట్రీ టిక్కెట్ల పై వెంటనే పునారాలోచన చెయ్యాలని డిమాండ్ చేశారు. 







సాగర తీర నగరమైన విశాఖలో ఇప్పటివరకు ఇలా ఎక్కడా బీచ్‌లలో టిక్కెట్లు పెట్టలేదు.  ఆర్‌కే బీచ్‌వద్ద గానీ, భీమిలి బీచ్‌లో గానీ ఎక్కడా రుసుములు వసూలు చేయడం లేదు. రుషికొండ, తొట్లకొండ, అప్పికొండ ఎక్కడా ఇలాంటి నిబంధనలు లేవు. కానీ ప్రభుత్వం కొత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. రుషికొండను కేంద్ర ప్రభుత్వం ‘బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌’గా గుర్తించడంతో అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు, టాయిలెట్లు, స్నానాల గదులు, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. 


ఈ బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి క్లీనర్లు, సెక్యూరిటీ, లైఫ్‌ గార్డులు అంతా కలిసి 39 మంది పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.6 లక్షల వ్యయం అవుతోంది. ప్రభుత్వం ఈ బీచ్‌కు ఎటువంటి నిధులు ఇవ్వడం లేదు. అందుకని పార్కింగ్‌ ఫీజు, టాయిలెట్‌, స్నానాల గదుల వద్ద ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవి సరిపోవడం లేదని ఇతర రాష్ట్రాల్లో బ్లూఫాగ్‌ బీచ్‌లను పరిశీలించారు. అక్కడ  ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారని .. ఇక్కడ కూడా అలాగే చేయాలని నిర్ణయించారు.  ఈ నెల 11వ తేదీ నుంచి ఈ బీచ్‌కు వచ్చే వారి నుంచి రూ.20 టిక్కెట్‌ వసూలు చేస్తామని ప్రకటించారు. 


ఈ టిక్కెట్‌ తీసుకునేవారు తాగునీరు, టాయిలెట్లు, స్విమ్మింగ్‌ జోన్‌, ఆటస్థలం వినియోగించుకోవచ్చు. పదేళ్ల లోపు పిల్లలకు రుసుము తీసుకోరు. పార్కింగ్‌ ఫీజు ఎప్పటిలాగే వసూలు చేస్తారు.