విశాఖలోని గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీయడంతో యాజమాన్యం చర్చలు పిలిచింది. జిల్లా అధికారుల సమక్షంలో జరిగిన చర్చల్లో కొన్ని కీలకమైన డిమాండ్లకు అంగీకరించారు. వాటి వివరాలను కార్మికులకు ఆర్డీవో వివరించారు. 


కార్మికులు మొదటి నుంచి చేస్తున్న డిమాండ్‌ తమకు 24 వేల నుంచి 36 వేల రూపాయల వరకుజీతాలు ఇవ్వాలని. దీనికి యాజమాన్యం ఒప్పుకో లేదు. అయితే దీనికి బదులు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద ప్రతి కార్మికుడికి పదివేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది. దీనికి తోడు ఇంక్రిమెంట్‌ ఇచ్చేటప్పుడు ‌అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది. గతంలోనే ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ ప్రస్తావించారు. అయితే కార్మికులు దీనికి ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ అదే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. 


సమ్మె చేస్తున్నారన్న కారణంతో ఉద్యోగాల నుంచి తీసివేసిన ఐదుగురు కార్మికులను ఉద్యోగంలోకి తీసుకోవడానికి కూడా గంగవరం పోర్టు యాజమాన్యం ఒప్పుకుంది. అయితే గంగవరం పోర్టును ప్రస్తుత యాజమాన్యం బాధ్యతలు తీసుకోక ముందు ఉద్యోగాలు కోల్పోయిన వారిని పనిలోకి తీసుకోవడానికి అంగీకరించలేదు. 


డెత్‌ బెనిఫిట్స్ విషయంలో ఈఎస్‌ఐ రూల్స్ ఎలా ఉంటే అలా ఇచ్చేందుకు గంగవరం పోర్టు అధికారులు ఓకే చెప్పారు. ప్రస్తుతం 45 రోజుల నుంచి సమ్మె చేస్తున్న కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. నో వర్క్ నో పే అనే రూల్ దేశవ్యాప్తంగా అమలులో ఉందని తెలియజేసింది. అందుకే సమ్మె చేసిన కాలాన్ని ఎల్‌వోపీగా పరగిణించబోతున్నట్టు చెప్పుకొచ్చింది. 


కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టు సమాన పనికి సమాన వేతనం అే అంశం చర్చకు రాలేది ఆర్డీవో చెప్పారు. ఇప్పటికైనా కార్మికులు శాంతించి ఇవాళ్టి నుంచి విధులకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వం గ్యారెంటీతో బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు కూడా అధికారులు ఓకే చెప్పారు. 


మరోవైపు కార్మికులు ఆగ్రహం మాత్రం చల్లారలేదు. తమ పొట్ట కొట్టిన వాళ్లు కోట్లు గడిస్తున్నారని తాము మాత్రం అర్ధాకలితో పడుకుంటున్నామంటున్నారు. అధికార పార్టీల అండ చూసుకొని అదానీ రెచ్చిపోతున్నారని నాలుగు గేట్లు పగులుగొట్టుకొచ్చిన తమకు మరో గేటు దాటడం పెద్ద కష్టం కాదన్నారు. తమ డిమాండ్లకు ఓకే చెప్పకుంటే మాత్రం సముద్ర మార్గంలో వచ్చి ముట్టడిస్తామని హెచ్చిరించారు. 


ఒక్కసారి సముద్రమార్గం నుంచి వస్తే కార్గోషిప్‌లను ఆపేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. తమకు సముద్ర కొత్త కాదని వేల మంది ప్రజలతో కచ్చితంగా ముట్టడిస్తామని అన్నారు. అదానీ సంపాదిస్తున్న లాభాల్లో 2 శాతమే అడుగుతున్నామని అన్నారు. పక్కనే ఉన్న విశాఖ పోర్టులో ఉద్యోగులకు కనీస వేతనం 40 వేలకుపై ఉంటే తమకు ఇక్కడ అందులో సగం కూడా లేదన్నారు. 


ఉదయం నుంచి గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.45 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న కార్మికులు ఇవాళ పోర్టు బంద్‌కు పిలుపునిచ్చారు. పోర్టు ముట్టడికి యత్నించారు. ఈ ఆందోళనకు కార్మికులు కుటుంబాలు వివిధ రాజకీయ పార్టీలు కదలి వచ్చాయి. ఈ బంద్‌ పిలుపుతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేట్లు, ముళ్ల కంచెలను దాటుకొని దూసుకెళ్లారు. ఈ ఉద్రిక్తతో పోలీసులకు గాయాలు అయ్యాయి. కార్మికులు కూడా గాయపడ్డారు కొందరు స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారకుండా గంగవరం పోర్టు యాజమాన్యంతో అధికారులు చర్చలు జరిపారు.