ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయం అడ్రెస్ మారనుంది. విశాఖ నుంచే పార్టీ కేంద్ర కార్యాలయం పని చెయ్యబోతోంది అని ఆ పార్టీ కీలక నేతలు తేల్చేసారు. వైజాగ్‌లోని ఎండాడ ప్రాంతంలో వైసీపీ కొత్త భవనానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. త్వరలో పరిపాలనా రాజధాని కానున్న విశాఖపట్నంలో నిర్మాణం చేయనున్న జిల్లా పార్టీ కార్యాలయం భవిష్యత్‌లో రాష్ట్ర పార్టీ కార్యాలయం అవుతుందని టిటిడి చైర్మన్, వైఎస్సార్‌సిపి ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి అన్నారు.
ఎండాడలోని పనోరమా హిల్స్ దగ్గర 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ 45 నుంచి 60 రోజుల్లో పార్టీ కార్యాలయం మొదటి దశ పనులు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా రాష్ట్రంలో అన్ని పార్టీ కార్యాలయాల్లో 24X7 కాల్ సెంటర్లు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. న్యాయపరమైన చిక్కులు పరిష్కారం అయిన తక్షణమే పాలనా రాజధాని పనులు మొదలు కానున్నట్టు వెల్లడించారు.
జనవరిలో భోగాపురం ఎయిర్ పోర్టుకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు సుబ్బారెడ్డి. అదాని డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే విశాఖలోని 40 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో నవ్వులు పంచుతున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజానీకమంతా అండగా ఉండి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్, ఎమ్మేల్యే అవంతి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి తరువాత ఎప్పుడైనా వైజాగ్ నుంచే పాలన మొదలుపెట్టనున్న సీఎం
మూడు రాజధానుల బిల్లు మాటెలా ఉన్నా సీఎం జగన్ మాత్రం విశాఖలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చెయ్యడం ఖాయమని వైసిపీ మంత్రులు పదేపదే చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్టే పరిణామాలు అన్నీ వేగంగా జరిగిపోతున్నాయి . ఫిబ్రవరి తరువాత ఏ క్షణమైనా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయాన్ని వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్నట్టు పార్టీ సంకేతాలు ఇస్తుంది .