Former AP Minister Ganta Srinivasarao : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రుషికొండపై నిర్మించిన అత్యంత విలాసవంతమైన భవనాలపై మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ రాజకోట రహస్యం ఎన్నికలకు ముందే వెల్లడై ఉంటే జగన్ పార్టీ YSRCPకి ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కావంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్‌లో గంటా పోస్ట్ చేశారు. రుషికొండ భవన నిర్మాణంపైకి ఎందుకీ కుప్పి గంతులు, దాగుడు మూతలు అంటూ ఆయన ప్రశ్నించారు. మొదట టూరిజం ప్రాజెక్ట్ అన్నారని, ఆ తరువాత ఫైవ్ స్టార్ హోటల్ అన్నారని, ఆ పైన సీఎం క్యాంప్ ఆఫీస్ అని పేర్కొన్నారంటూ గంటా ప్రశ్నించారు.
మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
ప్రభుత్వ నిర్మాణమైనా, ప్రైవేటు నిర్మాణమైనా ప్లాన్ వివరాలను ఆ కట్టడం దగ్గర ప్రదర్శిస్తారని, సెక్యూరిటీ కారణాల వల్ల అలా చేయలేదని సమర్థించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రపతి, గవర్నర్, ప్రధానమంత్రి బస చేయడానికి ఐఎన్‌ఎస్ డేగ, నేవల్ గెస్ట్ హౌస్ వంటి నిర్ధిష్ట విడిది ప్రాంతాలు ఉన్నాయని, వీవీఐపీలు ఉండే భవనాలు కావడం వల్లే రుషికొండపై ఏం కడుతున్నామో చెప్పలేకపోయామంటూ మాజీ మంత్రి అమర్నాథ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సరైన అనుమతులు లేవంటూ ప్రభుత్వమే నిర్మించిన ప్రజా వేదికను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారని, మరి గ్రీన్ ట్రిబ్యునల్ మొదలు అనేక అభ్యంతరాలు ఉన్న రుషికొండ భవనాన్ని ఏం చేయాలని గంటా వైసీపీ నేతలను ప్రశ్నించారు. ’రుషికొండ రాజకోట రహస్యం ఎన్నికలకు ముందే బహిర్గతమై ఉంటే మీ పార్టీకి ఈ 11 సీట్లు కూడా వచ్చేవి ఉండేవి కాదు’ అని గంటా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
బయట పెట్టిన గంటా శ్రీనివాసరావు
గడిచిన మూడేళ్లుగా రుషికొండపై అత్యంత గుట్టుగా సాగించిన భవనాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకెళ్లి మరీ బయట ప్రపంచానికి ఆదివారం చూపించారు. రూ.500 కోట్లతో అత్యంత విలాసవంతంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలోని ప్రతి కట్టడమూ అద్భుతం అన్నట్టుగా ఉంది. అత్యంత ఖరీదైన వస్తువులను వినియోగించారు. ఇంటీరియర్, ఫర్నీచర్.. ఇలా అంతా ఖరీదైనవే. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో, మెయిన్ స్ర్టీమ్ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.
దీనిపై స్పందించిన వైసీపీ ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే వినియోగించుకోవాలని, ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్ వంటి వారు విశాఖ వచ్చినప్పుడు వినియోగించుకునేందుకు అనుగుణంగా ఈ నిర్మాణం సాగించామని వెల్లడించింది. దీనిపై సామాజిక మాధ్యమాలు వేదికగా వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ చేసిన ప్రకటన, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ప్యాలెస్ గుట్టు ముందే వీడి ఉంటే.. వైసీపీకి వచ్చిన ఆ సీట్లు కూడా రావని విమర్శించారు. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.