Visakhapatnam Airport News: విశాఖపట్నం: సంక్రాంతి పండుగ పూట విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖ విమానాశ్రయంలో ఆకస్మికంగా పలు విమాన సర్వీసులు  రద్దు (Flights Cancel from Vizag Airport) చేశారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ సమయం ఎయిర్ పోర్ట్ లో వేచి చూడాల్సి రావడం, తరువాత ఫ్లైట్ ఎప్పుడు ఉంటుందనే వివరాలపై అప్ డేట్ ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండగ పూట గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాను.


ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక పోవడంతో విశాఖ రావలసిన సర్వీసులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి ఢిల్లీ ఇండిగో, ఢిల్లీ ఎయిర్ ఇండియా, విజయవాడ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు విశాఖకు వెళ్లేవి.. విశాఖ నుంచి వెళ్లే పలు సర్వీసులు రద్దయ్యాయి. దాంతో విశాఖ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఇండిగో సంస్థ సిబ్బందితో కొందరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ప్రయాణికులకు సరైన అప్ డేట్ ఇవ్వకపోవడం వారి మరింత ఆవేశానికి గురిచేస్తున్నట్లు సమాచారం.


అసలే పండుగ కావడంతో జర్నీకి ఇబ్బంది ఉండొద్దని కొందరు రైలుకు బదులుగా విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో విమానం కోసం వేచి చూస్తున్న వారిలో కొందరు పండుగ కోసం వెళ్తుంటే, మరికొందరు అర్జంట్ పని మీద ప్రయాణం ఫిక్స్ చేసుకున్నారు. దాంతో ఆ ప్రయాణికులు ఎయిర్ లైన్స్ సిబ్బందితో ఫ్లైట్ కోసం గొడవ పడుతున్నారు.