AP Viral News: కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెడుతున్నా ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలు మారడం లేదు. బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయిస్తున్నా.. ఆస్పత్రుల్లో కనీస వసతులు ఉండడం లేదు. కొన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఆధునిక వైద్య సామగ్రి అందుబాటులో ఉండదు. కొన్నింటిలో రోగులకు సరిపడా పడకలు ఉండవు. స్ట్రెచర్లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉండవు. ఇంకొన్ని చోట్ల వీల్ చైర్లు ఉండవు. ఇవన్నీ ప్రభుత్వాస్పత్రుల్లో వసతుల కొరతకు నిదర్శనాలు. ఆస్పత్రి ఫ్లోర్‌పై చికిత్స పొందుతున్న రోగులు ఎందరో ఉన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లలేని పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వాస్పత్రుల్లో పూర్తి స్థాయిలో నాణ్యమైన, మెరుగైన వైద్యం అందడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.
భుజాన ఆక్షిజన్ సిలిండర్
విశాఖపట్నం కేజీహెచ్‌లో వసతులు, మౌలిక సదుపాయాల కొరత మరోసారి చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి ఆక్షిజన్ సిలిండర్ మోసుకుంటూ వెళ్లడం విమర్శలకు దారితీసింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు విష్ణుమూర్తి భార్య అల్లు శిరీషకు మంగళవారం ప్రసవ నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించి వైద్యం అందించారు. నెలలు నిండకుండని బిడ్డకు శిరీష జన్మనిచ్చింది. దీంతో శిశువును ఎన్‌ఐసీయూలో ఉంచాలని వైద్యులు సిబ్బందికి సూచించారు.
పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్‌ఐసీయూకు బయలుదేరారు. బిడ్డను పట్టుకొని నర్సు ముందు నడుస్తుండగా అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్‌ను భుజాన వేసుకొని ఆమె వెనక నడిచారు. ఈ ఉదంతాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. విషయం కాస్తా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానందకు చేరడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని వైద్యులు, సిబ్బందిని పిలిచి హెచ్చరించారు. రోగుల సౌకర్యం కోసం బ్యాటరీ వాహనాన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు.
రెండు రోజుల క్రితం పేలిన వెంటిలేటర్ బ్యాటరీ
విశాఖ కేజీహెచ్‌లో రెండు రోజుల క్రితం సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. కేజీహెచ్ సీఎస్‌ఆర్ బ్లాక్ ఐసీయూ వార్డులోని వెంటిలేటర్ బ్యాటరీ పేలిపోవడంతో మంటలు వ్యాపించాయి. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని రోగులు, పిల్లలను మరో వార్డుకు తరలించారు. వెంటిలేటర్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఆస్పత్రిలో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చే సరికి మంటలు అదుపులోకి వచ్చాయి. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానందకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ముగ్గురు వైద్యులతో విచారణ
ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ శివానంద ముగ్గురు వైద్యులతో విచారణ కమిటీ వేశారు. అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ వి.రవి, ఏఆర్‌ఎంవో డాక్టర్ దవళ భాస్కరరావు, బయోమెడికల్ ఇంజినీర్ రాజేష్‌తో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ బృందం ప్రమాదంపై విచారణ జరిపి షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించిందని నిర్ధారించారు. ప్రమాదం జరిగిన తీరుపై సూపరింటెండెంట్‌కు నివేదిక సమర్పించారు.