DSC Agitation: వైసీపీ(YSRCP) ప్రభుత్వానికి నిరుద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తామని హామీ ఇచ్చిన జగన్ (Jagan)...అధికారంలోకి రాగానే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ(DSC) వేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లు ఉద్యోగాల ఊసే లేకుండా నెట్టుకొచ్చిన సీఎం జగన్..ఎన్నికల ఏడాది కావడంతో అరకొర పోస్టులతో డీఎస్సీ(DSC) నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై నిరుద్యోగ యువత భగ్గుమన్నారు. మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ సీఎం ఇంటిని సైతం ముట్టడించేందుకు యత్నించారు. ఇప్పుడు ప్రజాప్రతినిధుల ఇళ్లను సైతం ముట్టడిస్తున్నారు. విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసాన్ని కాంగ్రెస్(Congress) ఆధ్వర్యంలో నిరుద్యోగులు ముట్టడించారు.


వైసీపీ నేతలకు నిరసన సెగ
సార్వత్రిక ఎన్నికల సమయంలో అటు ఉద్యోగులు, అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు ఉద్యమాలతో హోరెత్తించగా,,,ఇప్పుడు నిరుద్యోగులు రోడ్డెక్కడం వైసీపీ(YCP) ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఏటా జాబు క్యాలెండర్ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్....ఉద్యోగాల ఉసే ఎత్తకపోవడంతో గుర్రుగా ఉన్నారు. మెగా డీఎస్సీ(DSC) కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభ్యర్థలకు...పుండుమీద కారం చల్లినట్లు 6వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం తీవ్రంగా బాధించింది. వారిలో అనుచుకున్న ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. మెగా డీఎస్సీ కోసం ఉద్యమబాట పట్టారు. ఎక్కడికక్కడ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి యత్నించిన నిరుద్యోగ సంఘాలను పోలీసులు అరెస్ట్ చేసి కట్టడి చేశారు.


అయితే నిరుద్యోగ యువతకు వివిధ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి, విశాఖలో కాంగ్రెస్(Congress) పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amaranath) ఇంటిని ముట్టడించారు. యూత్ కాంగ్రెస్ నేతలతోపాటు, ఎన్ఎస్ యూఐ నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 30 వేల పోస్టులతో వెంటనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.  అలాగే పది లక్షల నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న అందరూ మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అవసరం అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. దీంతో ఆందోళన చేస్తున్న 60 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు.


ఉద్యోగాలేవి జగన్..?
అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్....మొదటి ఏడాది కంటితుడుపు చర్యగా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు తప్ప ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఆ తర్వాత కరోనా బూచీ చూపించి జాబు క్యాలెండర్ కు మంగళం పాడేశారు. వైసీపీ నేతల తీరుతో వందలాది ప్రైవేట్ సంస్థలు సైతం ఇతర రాష్ట్రాలకు తరలిపోవడంతో...ఉపాధి దొరక్క నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మెగా డీఎస్సీపై కోటి ఆశలతో అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్న  అభ్యర్థుల నెత్తిన పిడుగు వేశారు ముఖ్యమంత్రి జగన్. ప్రతిపక్ష నేతగా 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తానని హామీ ఇచ్చిన జగన్...కేవలం 6,100పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడంపై డీఎస్సీ అభ్యర్థులు మండిపడుతున్నారు. తక్షణం మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.