Simhachalam Appanna Temple in Visakhapatnam: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున (మే 3న) 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారి తొలి దర్శనం చేసుకుని, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వేకువజాము నుంచే అప్పన్న ఆలయానికి పోటెత్తుతున్నారు.
అప్పన్న ఆలయంలో వేకువజాము నుంచే కార్యక్రమాలు
మంగళవారం వేకువజాము నుంచి చందనోత్సవ (Simhachalam Appanna Chandanotsavam) వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. అనంతరం ఆరాధన కార్యక్రమం నిర్వహించి తొలి దర్శనాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju)కు అందించారు. తదుపరి ఇతర ప్రముఖులకు దర్శనం అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులనుదర్శనాలకు అనుమతించారు. రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. గంగధార నుంచి 1008 కలశాలతో నీటిని తీసుకొచ్చి శ్రీ వైష్ణవస్వాములు నృసింహస్వామి వారి నిజరూపాన్ని అభిషేకిస్తారు. అనంతరం అర్చకులు తొలివిడత చందనాన్ని సమర్పిస్తారు.
చందనోత్సవ దర్శన సమయాలు
ఉచిత దర్శనం : తెల్లవారుజాము 4 గంటల నుంచి ప్రొటోకాల్ వీవీఐపీల దర్శనాలు : ఉదయం 5 నుంచి 6గంటల వరకు, 8 గంటల నుంచి 9 గంటల వరకు
రూ.1500 వీఐపీల దర్శనాలుః ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుంచి 3 గంటల వరకు భక్తులకు దర్శనం చేసే అవకాశం కల్పించారు.
సింహాచలానికి పోటెత్తిన వీఐపీలు
సింహాచలం ఆలయంలో చందనోత్సవం సందర్భంగా వరాహ నరసింహ ఆలయానికి వీఐపీలు పోటెత్తారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక గజపతి రాజు తొలి పూజ చేయగా.. మంత్రులు గుడివాడ అమర్ నాథ్, చెల్లుబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్,అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం లభించడం మహాభాగ్యం అన్నారు.
Also Read: Simhachalam Chandanotsavam 2022: లక్ష్మీ నరసింహ స్వామికి చందనోత్సవం ఎందుకు జరుపుతారో తెలుసా
Also Read: Simhachalam Chandanotsavam: సింహాచల చందనోత్సవానికి గంధపు చెక్కలు ఎక్కడ నుంచి తీసుకొస్తారో తెలుసా?